బీజేపీ హైకమాండ్ బండినే శరణుజొచ్చిందా?
posted on Nov 7, 2023 @ 9:32AM
తెలంగాణ బీజేపీలో అంతర్మథనం మొదలైందా? తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష అన్న అనుమానం మొదలైందా? తెలంగాణలో బీజేపీ ఫేస్ బండి సంజయ్ మాత్రమేనని ఆలస్యంగా గుర్తించిందా? అంటే పార్టీ శ్రేణులు మాత్రం ఔననే అంటున్నాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం అదే దిశలో సాగుతున్నాయి. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీ రాష్ట్రంలో రేసుగుర్రంలా ఉరకలెత్తింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అంటే బీజేపీయే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పుంజుకుంటున్నదని ఎవరైనా చెప్పినా జనం కూడా నమ్మే పరిస్థితి లేదన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే.. బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించారో ఆ క్షణం నుంచీ బీజేపీ అనూహ్యంగా వెనుకబడింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాటు చేసిన సభ మొత్తం బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.
ఇక అక్కడ నుంచి తెలంగాణలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్లు నాగంభోట్టు అన్నట్లుగా మారింది. అధికారమే తరువాయి నుంచి అసలు సింగిల్ డిజిట్ స్థానాలనైనా గెలుచుకుంటుందా అన్న పరిస్థితికి దిగజారింది. ఇందుకు రాష్ట్ర బీజేపీ నేతల కంటే పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
అటువంటి వేళ రాష్ట్రంలో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించేందుకు నరేంద్ర మోడీ మంగళవారం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇంతకు ముందే అమిత్ షా రాష్ట్రంలో పర్యటించి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ప్రధాని మోడీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అయితే మోడీ ఆ ప్రకటన చేస్తూ రాష్ట్రంలో బీజేపీలో మరిన్ని వికెట్లు పడిపోయే అవకాశం ఉందనీ విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కమలం రేకులు ఒక్కటొక్కటిగా రాలిపోతున్నాయి. పార్టీ క్యాడర్ అభీష్ఠానికి వ్యతిరేకంగా కొన్ని స్థానాలను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై కూడా బీజేపీలో నిరసనలు వెల్లువెత్తాయి. గతంలోనే.. అంటే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆయన తెలంగాణలో పొత్తుల ప్రశక్తే లేదు..ఒంటరిగానే అధికారంలోకి వస్తామని విస్పష్టంగా ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కారు. అంతే కాకుండా గతంలోలా అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమా కాగడా పెట్టి వెతికినా పార్టీ నేతల్లో, కార్యకర్తలలో కనిపించడం లేదు.
పార్టీకి అత్యంత విధేయుడైన బండి సంజయ్ తాజాగా తాను పార్టీ రాష్ట్ర సారథిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పార్టీ పరుగులెత్తిందనీ, ఇప్పుడు చతికిల పడిందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. అధిష్ఠానం కూడా బండి సంజయ్ దూకుడును గుర్తించి ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. హెలికాప్టర్ కూడా కేటాయించింది. పార్టీలో జోష్ నింపాలంటే బండి సంజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే బండి సంజయ్ కు ఈటల, అలాగే వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన నేతలతో పెద్దగా పొసగడం లేదన్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఎన్నికల ముందు అభ్యర్థి ప్రకటన మొదటికే మోసం తెస్తుందా అన్న ఆలోచన కూడా బీజేపీ హై కమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద మోడీ సభ తరువాత బీజేపీలో ఇప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితికి చుక్కపడుతుందేమో చూడాలి.