కర్నాటక సీఎం మార్పు తప్పదా?.. నాలుగో కృష్ణుడు ఎవరో?
posted on Sep 22, 2022 7:02AM
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఎన్నికలలో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్న కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. గతంలో కాంగ్రెస్ అనుసరించిన ఏ విధానాలనైతే విమర్శిస్తూ వచ్చిందో.. ఇఫ్పుడు అవే విధానాలను బీజేపీ అనుసరిస్తోంది. చీటికీ మాటికీ మంత్రులను మార్చే సంస్కృతి ఇప్పుడు బీజేపీది అయ్యింది. బొటాబొటీ మెజారిటీతో కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈ నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఇప్పుడు ఎన్నికలకు ఏడాది ముందు మరోసారి ముఖ్యమంత్రి మార్పు కు రంగం సిద్ధం చేసిందంటున్నారు.
ఒక వైపు పార్టలో అసమ్మతి, మరో వైపు ప్రభుత్వంపై వల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు. బెంగళూరు నగరాన్ని ఇటీవల అతలాకుతలం చేసిన వర్షాలు,వరదల సమయంలో ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై ఎగసిపడుతున్న ప్రజాగ్రహం. ఇలా అన్ని వైపుల నుంచీ ప్రభుత్వాన్ని సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ రాకున్నా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి రావడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన బీజేపీ. అప్పటి నుంచి అధికారాన్ని నిలుపుకోవడానికి నానా తంటాలూ పడుతోంది.
ఇటీవలకురిసిన వర్షాలకు బెంగళూరు ముంపునకు గురైంది. ఐటి కంపెనీలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వ పథకాల్లో అవినీతి పెచ్చరిల్లింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికలలో అధికారం నిలుపుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాగ్రహాన్ని తగ్గించి, వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు పావులు కదపడం మొదలెట్టింది. అందులో మొదటిగా ప్రజాభిమానం పొందడంలో అన్ని విధాలుగా విఫలమైన ముఖ్యమంత్రి బొమ్మై స్థానంలో మరొకరిని సీఎం కుర్చీలో కూర్చో పెట్టాలని భావిస్తోంది.
నాలుగో కృష్ణుడు ఎవరా అన్న ఆసక్తి కర్నాటక బీజేపీలో నెలకొంది. అసలే బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వ బండిని లాగిస్తున్న కర్నాటక బీజేపీలో సీఎం ఆశావహుల సంఖ్య భారీగానే ఉందంటున్నారు. ఇప్పుడు బొమ్మై స్థానంలో ఎవరికి అవకాశం ఇస్తే ఎవరు అసమ్మతి రాగం ఆలపిస్తారో అన్న ఆందోళన బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది.