BJP files case for MURDERING DEMOCRACY


 

The West Bengal unit of BJP has filed a case against ruling Trinamool Congress. Charges! BJP claims that Trinamool is trying to `murder democracy’! Reason... BJP is alleging that the local officers are refusing to receive nominations from BJP leaders to contest in forthcoming panchayat elections. The panchayat elections which are to be held in the first week of may turn out to be a life or death question for the BJP. The authority of Trinamool congress would firmly be established at the grass root level, if it gains the upper hand in the local elections. And that is the reason why we could see BJP knocking the doors of apex court for a trivial issue. The court will be giving its order on April 9th.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

  పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.  ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.  

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు ఆరామస్తాన్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన  ఫోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తులో  భాగంగా సిట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ను   విచారించింది. ఆరా పోల్ స్ట్రాటజీస్ సంస్థ వ్యవస్థా పకుడు ఆరా మస్తాన్‌ను  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో  హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన నూతన సిట్ శుక్రవారం విచారించింది. ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.    ఆరా మస్తాన్ గత కొన్నేళ్లుగా   రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్‌ను సమగ్రంగా పరిశీలించారు. ఈ కాల్ డేటా ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా?  లేదా? ఒక వేళ జరిగితే అందుకు ఎవరు ఆదేశించారు? అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.  సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆరా మస్తాన్ మీడియాతో మాట్లాడారు.  నూతన సిట్   ఆదేశాల మేరకే  తాను విచారణకు హాజరయ్యానన్న ఆరా మస్తాన్.. గతంలో పోలీసులు అడిగన ప్రశ్న లనే మళ్లీ అడిగారని చెప్పారు.  2020 నుంచే తన ఫోన్ ట్యాప్ అవుతోందన్న అనుమానం ఉందనీ, ఇదే విషయాన్ని సిట్ అధికారుల చేప్పానన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన సిట్ పోన్ ట్యాపింగ్ కేసు  దర్యాప్తును వేగవంతం చేసిందన్న ఆరా మస్తాన్..  నూతన సిట్ ఆధ్వర్యంలో ఈ కేసుదర్యాప్తు మరింత సమగ్రంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.   

29 నుంచి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. ఎన్ని రోజులో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ విడుదలైంది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం పదిన్నర గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుంది. ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో నిర్ణయిస్తారు.  బయట అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వేడిగా సాగనున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ  సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.  అలాగే, ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే అంశం కూడా సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక పోతే.. కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులకు సంబంధించి, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు, వాటికి అంతే ఘాటుగా రేవంత్ ప్రతివిమర్శలు చేయడమే కాకుండా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలంటూ సవాల్ చేయడం నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా  రేవంత్ సవాల్ ను స్వీకరించి మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పక్ష నేత అయిన కేసీఆర్ సభకు వస్తారా? లేక డుమ్మా కొడతారా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

కేసీఆర్ తెలంగాణ తెచ్చిన మొనగాడు... ఆయన పేరు చెప్పుకుంటా : కేటీఆర్

  మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్పుకుని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవును మా అయ్య తెలంగాణ తెచ్చిన మగాడు. మొనగాడు..మా నాన్న పేరు కాకుంటే ఇంకెవరు పేరు చెప్పుకుంటారు. బరాబర్ చెబుతా నువ్వు మంచి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు చెడు పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పడని కేటీఆర్ విమర్శించారు.  కేసీఆర్ నా తండ్రి.. ఆయన్ని అనరాని మాటలు అన్నందుకు ముఖ్యమంత్రిపై నాకు గొంతు వరకు కోపం ఉంది. నేను గుంటూరులో చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకుంటే తప్పు లేదటని ప్రశ్నించారు. ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకున్నాడు కాబట్టి చిట్టినాయుడు పేరు భీమవరం బుల్లోడు అని పెడదామని విమర్శలు గుప్పించారు. నేను గుంటూరులో చదువుకుంటే నీకేం ఇబ్బంది..నేను ప్రపంచమంతా చదువుకున్నాఅని కేటీఆర్ తెలిపారు.   జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వరుసగా రెండుసార్లు గెలిపించిన హైదరాబాద్‌ ప్రజలకు పాదాభివందనం చేసినా తక్కువేనని కేటీఆర్ అన్నారు. నేడు శేరిలింగంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్బంగా  కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డను కూల్చివేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చెక్‌డ్యామ్‌లను కూడా పేల్చివేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారని, తిట్ల భాష తమకూ వచ్చినా తాము అలా చేయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన  హామీలన్నీ ఎగనామం పెట్టారని ఆరోపించారు. పింఛన్లు  ఎప్పటి నుంచి పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు

హస్తినకేగిన సీఎం రేవంత్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సారి హస్తినకు బయలు దేరారు. శుక్రవారం (డిసెంబర్ 26) ఆయన ఢిల్లీకి బయలు దేరారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం హస్తినలో శనివారం (డిసెంబర్ 27) అక్కడ జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడమే అయినా, ఆ సమావేశం తరువాత రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై ఆయన ఈ భేటీలలో కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం (డిసెంబర్ 28)న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, జీహెచ్ఎంసీ విస్తరణ, ఎమ్మెల్యేల అనర్హత అంశాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయడానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుందని అంటున్నారు. వాటికి దీటుగా అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై గళమెత్తి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే విధంగా ఈ సారి సమావేశాలకైనా కేసీఆర్ హాజరౌతారా లేదా అన్న ఆసక్తి కూడా సర్వత్రా వ్యక్తమౌతోంది.  

కేటీఆర్ పై రేవంత్ విమర్శలు.. జగన్ కూ వర్తిస్తాయంటున్న నెటిజనులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. రేవంత్ పై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ బుధవారం (డిసెంబర్ 24) కోస్గిలో నూతన సంర్పంచ్ ల అభినందన సభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైనా, అలాగే కేటీఆర్ పైనా విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో తనపై చేసిన విమర్శలకు ఓ రేంజ్ లో బదులిచ్చారు.  ఈ సందర్భంగా రేవంత్ కేటీఆర్ , ఆమె సోదరి కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలనూ ప్రస్తావించారు. సొంత చెల్లిని పండక్కి పిలిచి చీర కూడా పెట్టలేని వాళ్లు తనను విమర్శిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.  ఆస్తిలో   వాటాకు వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతుందనీ..సొంత చెల్లినే  బయటకు పంపించిన వారు నాకు రాజకీయ నీతులు చెపుతున్నారు,   తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆ విమర్శలపైనే ఇప్పుడు నెటిజనులు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.  రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.  రేవంత్ విమర్శలు  అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా జగన్ తన ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనీ, పార్టీలో ప్రాధాన్యత కోరుతోందన్న ఉద్దేశంతోనే దూరంపెట్టారని గుర్తు చేస్తున్నారు.  రేవంత్ కేటీఆర్ పై సంధించిన విమర్శనాస్త్రాలను  ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కి కూడా ఆపాదిస్తూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అన్నా చెళ్లెళ్ల వివాదాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయ   ఇటు తెలంగాణలో కేటీఆర్, కవిత, అటు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు పొలిటికల్ గా బీఆర్ఎస్న, వైసీపీలకు నష్టం చేకూరుస్తున్నాయనడంలో సందేహం లేదు.  తెలంగాణలో కేటీఆర్ లక్ష్యంగా కవిత, ఏపీలో జగన్ లక్ష్యంగా షర్మిల చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు బీఆర్ఎస్, వైసీపీల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతే కాకుండా కేటీఆర్ ను, జగన్ ను సొంత చెల్లెలికి అన్యాయం చేసిన అన్నలుగా ప్రజల ముందు నిలబెడుతున్నాయంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. వీటికి బదులు చెప్పలేక కేటీఆర్, జగన్ లు సతమతమౌతున్నారు.