వైసీపీ అవినీతిపై బీజేపీ పోరు
posted on Apr 26, 2023 @ 4:09PM
తెలుగుదేశం, బీజేపీ చెలిమికి సంబంధించిన స్పష్టమైన సంకేతం ఒకటి కమలం పార్టీ నుంచి వచ్చింది. ఏపీలో జగన్ సర్కార్ అవినీతి, అక్రమాలపై జిల్లాలూ, గ్రామాల వారీగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయాలని నిర్ణయించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సమస్యలన్నీ ఒకే సారి చుట్టుముడుతున్నట్లైంది. జగన్ ప్రస్తుతం సమస్యల ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నారు. వివేకా హత్య కేసులో అనివాష్ రెడ్డి అనివార్యం కావడంతో పడుతున్న ఇబ్బంది ఒకవైపు.. సమీప బంధువు బాలినేని అలకపాన్పు ఎక్కడంతో ఎదురౌతున్న తలనొప్పి మరో వైపు.. ఇంత కాలం తన నిర్ణయాలకు సానుకూలంగా ఉంటూ వచ్చిన బీజేపీ అగ్రనాయకత్వం సహాయ నిరాకరణ మూడో వైపు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ అవినీతిపై బీజేపీ సమర భేరి మోగించింది.
ప్రధాని మోడీ ఇటీవల విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకులకు ప్రభుత్వ అవినీతిపై ఊరూవాడా చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించినా.. ఏపీ బీజేపీ నాయకత్వం పట్టించుకోకపోవడంతో పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినా రాష్ట్ర నాయకత్వం పట్టించుకోక పోవడంతో ఏపీలో అధికార పార్టీ చేస్తున్న భూ కబ్జాలు, దౌర్జన్యాలు, వినీతిపై అంశాల వారీగా చార్జిషీట్లు రూపొందించేందుకు ఒక కమిటీని నియమించింది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌లతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ మే 5వ తేదీ నుంచి పని ప్రారంభించనుంది.
కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు. ఐదు నెలల క్రితం... వైజాగ్‌లో పార్టీ నేతలతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని పార్టీ నేతలకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేసినా ఇప్పటి వరకూ పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టించుకోకపోవడంతో కేంద్ర నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది.
ఈ కమిటీ త్వరలోనే విజయవాడలో భేటీ కానుంది. ఆ భేటీలో కార్యాచరణ రూపొందించుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతుంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు, ఇసుక దందా, విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులలో జరిగిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లు దాఖలు చేసి పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయనుంది. కాగా జగన్ సర్కార్ అవినీతిపై కావలసిన సమాచారం స్థానిక తెలుగుదేశం శ్రేణుల నుంచి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించింది.