ఆఖరి గంటలో 9 శాతం పోల్! రిగ్గింగ్ జరిగిందని బీజేపీ కంప్లైంట్
posted on Dec 2, 2020 @ 1:57PM
గ్రేటర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందా? పాతబస్తిలో పోలింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగింది? చివరి రెండు గంటల్లో ఏం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గందరగోళంగా మారింది. గ్రేటర్ పోలింగ్ పై తుది అధికారిక లెక్కలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించింది. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. గతంలో కంటే పోలింగ్ శాతం భారీగా తగ్గిందని అంతా భావించగా.. ఎస్ఈసీ లెక్కల ప్రకారం గతంలో కంటే ఇప్పుడు పెరిగింది. చివరి గంటలో ఏకంగా తొమ్మిది శాతం పోలింగ్ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పార్టీలు చివరి గంటలో రిగ్గింగ్ చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటల వరకు 3.95 శాతం పోలింగ్ జరిగింది. 11 గంటల వరకు ఇది 11.62 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ శాతం 20.35 శాతంగా ఉండగా.. 3 గంటల సమయానికి 29.76 శాతానికి చేరింది. సాయంత్రం ఐదు గంటలకు 36.73 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అప్పటి వరకు ప్రతి గంట గంట పోలింగ్‌ను పది నిమిషాల్లో ప్రకటించిన ఎన్నికల సంఘం సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని నిలిపివేసింది. కారణాలను మాత్రం తెలుపలేదు.దీంతో పోలింగ్ శాతం 38 శాతం ఉంటుందని భావించారు. కాని తుది లెక్కల్లో మాత్రం గ్రేటర్ లో 45.97 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. ఎస్ఈసీ లెక్కల ప్రకారం చివరి గంటలోనే 9 శాతం ఓటింగ్ పెరగగా.. పాతబస్తిలో ఇది దాదాపు 12 శాతంగా ఉంది. చార్మినార్ , చాంద్రాయణ గుట్టలో దాదాపు 15 శాతం పోలింగ్ చివరి గంటలోనే జరిగిందని ఎన్నికల సంఘం లెక్కలను బట్టి తెలుస్తోంది. దీంతో ఓల్ట్ సిటీలో ఓ పార్టీ చివరి గంటల్లో రిగ్గింగ్ చేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
పాతబస్తీలో ఎంఐఎం పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ నేతలు రామచంద్రరావు, ఆంటోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీలో మజ్లీస్‌పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడుతుందని తాము సమాచారం ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్సీ రాంచంద్రరావు ఆరోపించారు. చివరి గంటలో అకస్మాత్తుగా పోలింగ్ ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. ఘాన్సీబజార్ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ 1 నుంచి 19 వరకు, పురానాపూల్ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ 3,4,5,38 నుంచి 45 వరకు ఉన్న బూత్‌లలో 94 శాతం పోలింగ్ జరిగిందని.. ఇక్కడ ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని ఆయన ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పోలింగ్ బూత్ లలోకి వెళ్లి రిగ్గింగ్ చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు రాంచంద్రరావు. రిగ్గింగ్ చేసుకోవాలనే బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారని ఆయన ఆరోపించారు. ఆ రెండు డివిజన్లలో రీపోలింగ్ జరపాలని కోరారు.
ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు కనిపించలేదు. పాతబస్తిలోని కొన్ని డివిజన్లలో మధ్యాహ్నం 1 గంట వరకు ఐదు శాతం కూడా పోలింగ్ జరగలేదు. ఓల్ట్ సిటీలో ఓవరాల్ గా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం5 గంటలకు మొత్తం 10 గంటల్లో 20 శాతం పోలింగ్ జరగగా... ఆఖరి గంటలోనే మరో 20 శాతం పోలింగ్ జరగడం అశ్చర్యపరుస్తోంది. ఆఖరి గంటలో ఎక్కడా హడావుడి లేకుండా, క్యూ లైన్లు కనిపించకుండా పోలింగ్ ఎలా పెరిగిందనేది ఎవరికి అర్ధం కావడం లేదు. పోలింగ్ ముసిగిన సమయానికి ఎక్కడా ఓటర్లు లైన్‌లో ఉన్నట్లు, పోలింగ్ కోసం అదనపు సమయం తీసుకున్నట్లు ప్రకటించలేదు. కాని ఎన్నికల సంఘం తుది లెక్కల్లో మాత్రం పోలింగ్ 45.97 శాతానికి పెరిగింది. ఈ లెక్కన సాయంత్రం ఆఖరి గంటలో జరిగిన పోలింగ్ శాతం 9 శాతంగా నమోదైంది. అప్పటి వరకు పోలింగ్ కేంద్రాల వైపు చూడని ఓటర్లు ఒక్కసారిగా కేంద్రాల్లోకి ఎలా పోటెత్తారన్నది అర్ధం కాకుండా ఉంది. 10 గంటల పాటు రాని ఓటర్లు చివరి గంటలో ఎలా వచ్చారు… ఎక్కడి నుంచి వచ్చారో తెలియడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఉదయం నుంచి జరిగిన పోలింగ్.. ఎస్ఈసీ ఇచ్చిన తుది లెక్కలకో గ్రేటర్ పోలింగ్‌లో ఆఖరి గంటలో ఏం జరిగిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పోలింగ్ శాతంపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉంది. మరీ ఎస్ఈసీ దీనిపై ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరీ..