కమలదళం పల్లె బాట.. బీజేపీ వ్యూహం మార్చిందా?
posted on Jan 16, 2023 @ 1:42PM
తెలంగాణలో ఇంతవరకు కొంత దూకుడు ప్రదర్శించిన బీజేపీ, ఇప్పడు వ్యూహం మార్చింది. ఒకటి రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిరహించడం వలన అంతగా ప్రయోజనం ఉండదని పార్టీ నాయకులు గుర్తించారు. అందుకే రూట్ మార్చి ఉరూరా సభలు , సమావేశాలు, నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా ఇతర జాతీయ నాయులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి భారీ బహిరంగ సభలు నిరహించడం వలన, పార్టీకి కొత్త జోష్ వస్తుంది. అందులో సందేహం లేదు.
అయితే, ఓట్ల లెక్కల దగ్గర కొచ్చేసరికి లెక్క మారుతుందని, బీజేపే నాయకత్వం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం తేలిపోయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలోపోయి రోడ్డెక్కిన తర్వాత, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ బలం మరింత పెరిగిందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.
అయితే రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నా జాతీయ నాయకుల భుజాల మీద నుంచి ఓటరుకు గురి పెట్టినా అంతగా ప్రయోజనం ఉండదని అందుకే నేరుగా ఓటరు ఇంటి తలుపు తట్టాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. అలాగని జాతీయ నేతల పర్యటనలు పబ్లిక్ మీటింగ్స్ ఉండవా అంటే, ఉంటాయి, కానీ, ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, స్థానిక సమస్యలకు జాతీయ పరిష్కారాలపై చర్చించడంపై దృష్టిని కేద్రేకరించాలనే నిర్ణయంతో బీజేపీ కొత్త ప్రణాళికను సిద్డం చేసినట్లు చెపుతున్నారు. ఇపుడు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో భారాసకు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ అని అంతా అంగీకరిస్తున్నారు.
చివరకు జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని ఒప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కమల దళం ఇక క్షేత్ర స్థాయిలో బలపడాలన్న ఆలోచనకు వచ్చింది. అందుకే.. గ్రామ, గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం వంటి వాటితో ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించింది. ముఖ్య నాయకుల పాదయాత్రలు, బస్సు యాత్రల సంగతి ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని కమలనాథులు నిర్ణయించారు. అలాగే 119 నియోజక వర్గాలలో 9 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది. ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు.బూత్ స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.
ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, హూంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. మరో వంక, ఫిబ్రవరిలో సిట్టింగ్, మాజే ఎమ్మెల్యేలతో పాటు, నియోజక వర్గ స్థాయి నేతలు పెద్ద ఎత్తున పార్టీ చేరతారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.
కాగా, ఈరోజు ఢిల్లీ ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో,తెలంగాణ పై ప్రత్యేక చర్చః, తీర్మానాలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వ మార్పు, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి మరొకరికి స్థానం కల్పించే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలో 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహంతో కమల దళం కదులుతోందని అంటున్నారు.అయితే, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలిగించి ఆ బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించే విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.