వద్దు వద్దంటున్నా వస్తే ఇదే గతి!
posted on May 25, 2023 @ 12:24PM
వద్దు వద్దంటున్నా వస్తున్న నేతలకు చిత్తూరు జిల్లాలో రెండు గ్రామాల ప్రజలు కీలెరిగి వాత పెట్టిన చందంగా గుణపాఠం చెప్పారు. సమస్యలు పరిష్కరించకుండా.. గడపగడపకూ మన ప్రభుత్వం అంటూ వచ్చి మీకు ఈ నాలుగేళ్లలో ఇంత సొమ్ము పందేరం చేశాం, అంత సొమ్ము పందేరం చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నేతలకు ఇప్పటి వరకూ సమస్యలపై నిరసన గళం ఎత్తి ప్రశ్నించిన జనం ఇప్పుడు ఏకంగా ఆ కార్యక్రమాన్నే బహిష్కరిస్తున్నారు. వారు వచ్చే సమయానికి తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోతున్నారు. ఇటువంటి అనుభవమే డిప్యూటీ సీఎం నారాయణ స్వామికీ, ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకూ ఎదురైంది.
రావద్దు బాబోయ్ అని జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు మా ప్రభుత్వం అంటూ వస్తుండటంతో జనం ఇక ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోవడమొక్కటే మార్గమని డిసైడైనట్లు ఉన్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూతలపట్టు మండలం పేట అగ్రహారం గ్రామస్తులు బహిష్కరించారు. ఆయన వస్తున్న విషయాన్ని తెలుసుకుని తమ ఇళ్లకు తాళాలు వేసుకుని గ్రామం నుంచి బయటకు వెళ్లి పోయారు. ఇదే అనుభవం ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికీ ఎదురైంది.
ప్రభుత్వం పట్ల ప్రజలలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం, అసంతృప్తికి ఈ సంఘటనలు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పూతలపట్టు మండలం పేట ఆగ్రహారానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు వచ్చే సరికి అక్కడ అన్ని ఇళ్లూ తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను వాడుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా బహిష్కరిస్తారంటూ రుసరుసలాడారు. సిగ్గూ శరం రోషం ఉంటే తీసుకున్న పథకాలను వాపసు చేయండని ప్రజలకు సవాల్ విసిరారు. అంతే కాదు .. ఇక ముందు పేట అగ్రహారం వాసులకు ప్రభుత్వ పథకాలు వంద శాతం అందవని ప్రకటించారు. అయినా ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకుల ఇష్టాయిష్టాల మేరకు అందేవి కావనీ, అవి ప్రజల హక్కు అనీ ఎమ్మెల్యేకు తెలియదా అని పరిశీలకుల ప్రశ్నిస్తున్నారు. తమ విధానాలను వ్యతిరేకించే వారికి పథకాలు అందనీయను అనడం అహంకారమే అవుతుందంటున్నారు. సరే అదలా ఉంచితే.. ఎమ్మెల్యే వెళ్లిపోగానా స్వగృహాలకు తిరిగి వచ్చిన జనం తమ ఇళ్లను, ఎమ్మెల్యే తిరిగిన వీధులను పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసుకున్నారు.
ఇక ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికీ ఎదురైంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గ పరిధిలోని పాచిగుంట గ్రామంలో ఆయన బుధవారం ( మే24) గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఆయన గ్రామానికి వచ్చే సమయానికి గ్రామస్తులు తమ ఇళ్లకు తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయారు. పాతిక గడప ఉన్న ఆ గ్రామంలో ఇద్దరు ముగ్గురు వినా ఎవ్వరూ డిప్యూటీ సీఎం వచ్చే సమయానికి లేకుండా వెళ్లిపోయారు. ప్రభుత్వ తీరుకు ప్రజలు ఈ విధంగా నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ఇద్దరు వైసీపీ నేతలకు ఇదే మర్యాద జరగడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏస్థాయిలో ఉందో అర్ధమౌతుంది.
అయితే ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి చర్యలు తీసుకోవలసిన అధికార పార్టీ నేతలు.. మా కార్యక్రమాలను బహిష్కరించిన మీకు ప్రభుత్వ పరంగా ఎటువంటి పథకాలు అందవంటూ హెచ్చరించడం.. ఇప్పటి దాకా తీసుకున్న పథకాలను వాపసు చేయండంటూ మండిపడటం విచిత్రంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. తమ గడపగడపకూ కార్యక్రమాన్ని బహిష్కరించిన కుటుంబాలను ప్రభుత్వ పథకాల నుంచి తొలగించాలని వలంటీర్లకు, అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఆయా కుటుంబాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతే కాదు.. ఈ నాలుగేళ్లలో ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత సొమ్ము వారి అక్కౌంట్లలో జమ అయ్యిందో వివరాలు తీయండి అంటూ వాలంటీర్లకు ఆదేశించారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరించారు.