గుడివాడలో వైసీపీ గూబ గుయ్యిమంది!
posted on Apr 14, 2023 @ 4:25PM
ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటే రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ దూసుకుపోతుంటే, వరుస సమావేశాలతో చంద్రబాబు వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటనలు దాదాపు పూర్తి చేసుకున్న చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు.
చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తొక్కని అడ్డదారి లేదు. చేయని కుతంత్రమూ లేదని తెలుగుదేశం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. తాజాగా మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన సభలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గుడివాడలో బాబు సమావేశాలను అడ్డుకునేందుకునేరుగా మాజీ మంత్రి నాని రంగంలోకి దిగాల్సి వచ్చింది.
చివరకు రోడ్డుపై లారీలను అడ్డుగా ఉంచి సభలను అడ్డుకోవాలన్న ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తెలుగుదేశం నేతలను శాపనార్ధాలు పెట్టేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొడాలి నాని దౌర్జన్యాలపై ముందే అవగాహన ఉన్న టీడీపీ ప్రతి పరిణామానికి సిద్ధపడి కార్యక్రమాన్ని రూపొందించుకుంది. నాని రౌడీఇజాన్ని ఇంత కాలం భరించిన గుడివాడ ప్రజలు చందరబాబు సభలకు రెట్టించిన ఉత్సాహంతో హాజరయ్యారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓటమి చవి చూసిన తరువాత వైసీపీ నేతల దౌర్జన్యాలను మరింత పెంచారన్నది టీడీపీ చెబుతున్న మరో కోణం. దీంతో సహజంగానే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ప్రజలు తమ సభలకు హారౌతున్నారని తెలుగుదేశం భావిస్తోంది.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరపకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన Go No1 ను న్యాయస్థానాలు అడ్డుకోవడంతో బాబు పర్యటనలలో మరింత ఊపు వచ్చింది. బాబు సభలను అడ్డుకోవడం కోసం లారీలు, ట్రాక్టర్లు అడ్డుగాపెట్టడాన్ని గుడివాడప్రజలు గమనిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరి బద్రత ఉన్న చంద్రబాబు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆంధ్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గురువారం (ఏప్రిల్ 13) గుడివాడ సభలో చంద్రబాబు ప్రసంగం హైలైట్ కాగా, శుక్రవారం (ఏప్రిల్ 14) నాని ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలుఅతని స్థాయిని మరింత దిగజార్చాయని ఓటర్లు చెబుతున్నారు.