కమలం గూటికి భోగ శ్రావణి.. బీఆర్ఎస్ కు బిగ్ షాక్
posted on Mar 1, 2023 @ 12:59PM
జగిత్యాల మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి కమలం గూటికి చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం (మార్చి 1)న కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు.
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బాధ్యతలు నుండి తప్పుకోవడంతోపాటు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన భోగ శ్రావణి బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇందుకోసం భోగ శ్రావణి హస్తిన వెళ్లారంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో ఆమె కమలం గూటికి చేరుతారని అంటున్నారు.
బీజేపీ రాష్ట్ర చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ భోగ శ్రావణిని పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం సోమవారం భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి మంతనాలు జరిపారని సమాచారం. ఇప్పుడు తాజాగా ఆమె హస్తిన బయలు దేరి వెళ్లడంతో ఆమె కాషాయ కండువా కప్పుకోవడం ఖరారైందని చెబుతున్నారు.