బీజేపీకి బిగ్ షాక్.. ఐదు రాష్ట్రాల్లో అధికారం పోయింది!!
posted on Dec 23, 2019 @ 5:28PM
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాకిచ్చాయి. 81 స్థానాలకు గాను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 46 సీట్లు గెలుచుకొని ఈ కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. బీజేపీ కేవలం 25 సీట్లతో ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో అధికారం కోల్పోయిన బీజేపీ.. తాజాగా జార్ఖండ్‌లోనూ అధికారానికి దూరమైంది. ఏడాది కాలంలో ఐదో రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో బీజేపీ అధిష్టానంలో కలవరం మొదలైంది.
కొన్నేళ్లుగా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ బీజేపీ నినదిస్తోంది. దానికి తగ్గట్టే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి వరుసగా రెండు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. కానీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీకి షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ కూటమికి చెందిన పార్టీలు పలు రాష్ట్రాలలో బీజేపీని అధికారానికి దూరం చేస్తున్నాయి. ఇదే బీజేపీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఏడాదిలో ఐదు కీలక రాష్ట్రాలు చేజారిపోవడంతో బీజేపీ పెద్దలు ఢీలా పడిపోతున్నారు. త్వరలో జరగనున్న ఢిల్లీ మరియు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారనున్నాయని పరిశీలకులంటున్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీల చేతిలో కూడా బీజేపీకి ఓటమి ఎదురైతే.. బీజేపీకి కష్టాలు తప్పవని అంటున్నారు.