2జీ స్కామ్ లో విచారణకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్
posted on Jan 31, 2012 @ 2:41PM
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న 2జీ రేడియో తరంగాల కేసులో ప్రధానమంత్రి కార్యాలయం పాత్రపై విచారణ జరపాలంటూ జనతా పార్టీ అధినేత డాక్టర్ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.అంతేకాకుండా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై విచారణకు ఆయా సంస్థలు మూడు నెలల్లో అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజాను 2జీ స్కామ్‌లో విచారణ జరిపే నిమిత్తం అనుమతి ఇచ్చేందుకు పీఎంఓ సుదీర్ఘ సమాయాన్ని తీసుకున్న విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో స్వామి పేర్కొనగా న్యాయస్థానం పై విధంగా ఆదేశించింది.
ఏ.రాజా వ్యవహారంలో అనుమతి ఇచ్చే విషయంలో పీఎంఓ తీవ్ర జాప్యాన్ని నిరశిస్తూ ఢిల్లీ హైకోర్టును స్వామి ఆశ్రయించగా, పీఎంఓకు ఆదేశాలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీనిపై జస్టీస్ ఏకే.గంగూలీ విచారణకు స్వీకరించారు. ఒక సంస్థ నాలుగు నెలల లోపు తుది నిర్ణయం తీసుకోలేక పోతే కోర్టు అనుమతి ఇవ్వొచ్చొంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా, భారత రాజ్యాంగం మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రజా సేవకుడిపై ఫిర్యాదు చేసేందుకు హక్కు ఉందన్నారు. దీనిపై డాక్టర్ స్వామి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు కేంద్రానికి చెంప పెట్టులాంటిదన్నారు. ఏ.రాజా వ్యవహారంలో అనుమతి ఇచ్చేందుకు పీఎంఓ 16 నెలల సమయం తీసుకుందని స్వామి గుర్తు చేశారు.