రాష్ట్ర విభజనపై పార్టీల వికృత రాజకీయ క్రీడలు-2

 

ఇక సీమాంధ్రలో పరిస్థితి దీనికి భిన్నంగాలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగుతున్నకొద్దీ క్రమంగా కిరణ్ మేలి ముసుగులు తొలగిపోతుంటే, ఆయన సమైక్యవాదం ఎటువంటిదో ప్రజలకీ అర్ధం అవుతోంది. కాంగ్రెస్ తురుపు ముక్కగా భావించబడుతున్న జగన్మోహన్ రెడ్డి, మొదట సమైక్యవాదం బలంగా వినిపించి, ఇప్పుడు కీలకమయిన తరుణంలో కాడి పక్కన పడేసి ఓదార్పు యాత్రలు, దేశాటనలు అనడం కూడా ఈ రాజకీయ క్రీడలో భాగమే.

 

వచ్చే ఎన్నికలలో యుపీయే కూటమి మెజార్టీ సాధిస్తే, కేంద్రంలో తమకు అతను మద్దతు ఇస్తాడని కాంగ్రెస్ భావిస్తే, అతను దేశాటన చేసి కాంగ్రెసేతర పార్టీలను, ప్రభుత్వాలను కూడగట్టే పనిలో ఉన్నాడు. అయితే అది విభజన సజావుగా సాగేందుకు ఎంచుకొన్న మార్గమో లేక తనపై వస్తున్న ఆరోపణలను తప్పించుకొనేందుకు ఉపాయమో ఆయనకే తెలియాలి.

 

ఇక తెదేపా రాష్ట్ర విభజన ప్రక్రియలో నిత్యం మారుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ తదనుగుణంగా ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకొంటూ ముందుకు సాగుతోంది తప్ప నేటికీ రాష్ట్ర విభజనపై నిర్దిష్టంగా మాట్లాడటం లేదు.

 

చివరికి మజ్లిస్ వంటి చిన్న పార్టీ కూడా రాష్ట్ర విభజనతో తన వోటు బ్యాంక్ చీలిపోతుందనే ఆలోచనతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతూ వచ్చి, విభజన అనివార్యమని భావించి తన సమైక్యవాదం వలన తనకే నష్టమని గ్రహించగానే ఈరోజు అఖిలపక్ష సమావేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తున్నామని చెప్పి, వీలయితే రాయల తెలంగాణా ఏర్పాటు చేయమని ఒక ఉచిత సలహా కూడా పడేసింది.

 

ఈవిషయంలో మొదటి నుండి ఖరాఖండిగా ఉన్నవి ఒక్క లెఫ్ట్ పార్టీలేనని చెప్పక తప్పదు. సీపీఎం నేటికీ రాష్ట్ర విభజనను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూనే ఉంది. సీపీఐ తెలంగాణా ఏర్పాటుని అంతే ఖచ్చితంగా సమర్దిస్తూ వచ్చింది.

 

అయితే ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో కానీ దేశంలో గానీ తామే స్వయంగా ప్రభుత్వం ఏర్పరిచే స్థితిలో లేవు గనుకనే అంత నిక్కచ్చిగా ఉండగలిగాయని చెప్పవచ్చును. అంతే కాక వాటి వైఖరి వలన ఆ రెండు పార్టీలకి కొత్తగా వచ్చేలాభం కానీ నష్టం గానీ ఏమీ ఉండదు కూడా. లేకుంటే అవీ ఇతర పార్టీలలాగే వ్యవహరించేవేమో!