హైదరాబాద్ బిహెచ్ఇఎల్ లో ఉద్యోగిని ఆత్మహత్య..!!
posted on Oct 18, 2019 @ 5:17PM
హైదరాబాద్ బిహెచ్ఇఎల్ లో ఒక ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆర్థిక విషయాలు, కుటుంబ కష్టాలు మరణానికి కారణం కాదని సమాచారం. తోటి ఉద్యోగి నుంచి ఎదురైన వేధింపులే ఆమె బలవన్మరణానికి అసలు కారణం అని సూసైడ్ నోట్ లో ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన నేహా చోక్సి రాజస్థాన్ కు చెందిన మహిళ. ఆరు నెలల క్రితం భోపాల్ నుంచి హైద్రాబాద్ బి.హెచ్.ఇ.ఎల్ కు బదిలీ అయ్యారు. కుటుంబంతో కలిసి మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో నివాసముంటున్నారు.
ఆఫీసులో డిజిఎం కిషోర్ తో పాటు తోటి ఉద్యోగుల వేధింపులు భరించలేకే ఆమె చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ లో రాసి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బి.హెచ్.ఇ.ఎల్ లో నేహా అకౌంట్స్ విభాగంలో పని చేస్తుంది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ దాదాపు ఏడుగురు మంది తనను వేధింపులకు గురి చేశారని సూసైడ్ నోట్ లో నేహా పేర్కొంది. విషయం తెలుసుకున్న భర్త తీవ్ర విషాదానికి గురి అయ్యాడు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.