బెంగళూరు పేలుడు ఘటన.. రాజకీయ లబ్ధి కోసం వెంపర్లాట సరికాదు!
posted on Mar 7, 2024 9:11AM
దేశంలో అత్యంత ప్రశాంతమైన, శాంతియుత నగరాల్లో ముందువరుసలో ఉండే బేంగళఊరు ఉగ్రదాడితో ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ సంఘటన నిఘావర్గాల వైఫల్యాలను కళ్లకుకట్టింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మన భద్రత డొల్ల తనాన్ని సందేహాలకు అతీతంగా బట్టబయలు చేసింది. ఔను బెంగళూరు బ్రూక్ షీల్డ్ లోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగి రోజులు గడుస్తున్నా.. ఈ పేలుడు వెనుక ఉన్న ఉగ్ర సంస్థ, పేలుడుకు కారణమైన వ్యక్తి వంటి వివరాలు తెలియరాలేదంటూ మన నిఘా, దర్యాప్తు సంస్థల పనితీరు ఎంత దివ్యంగా ఉందో అర్ధమౌతోంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించిన తరువాత కూడా వీసమెత్తు అయినా పేలుడు వెనుక శక్తులు, పేలుడు మోటివ్ వంటివి ఏవీ కనుగొనలేకపోయింది.
ప్రాణనష్టం లేకపోయినప్పటికీ పేలుడు తీవ్రత, అది జరిగిన ప్రదేశం గమనిస్తే దీనిని ఆషామాషీగా తీసుకోవడానికి ఎంత మాత్రం వీలులేదన్న సంగతి బోధపడుతుంది. ఈ పేలుడు ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరున్న బెంగళూరులో ప్రశాంతత నేతిబీరకాయలో నేతి చందమేనని రుజువైపోయింది. జనసమ్మర్దం అధికంగా ఉన్న ప్రాంతంలో పేలుడుకు పాల్పడటం వెనుక ముష్కరుల ఉద్దేశం ఏమిటన్నది తపేలుడు పరికరాన్ని అమర్చడం వెనుక దుండగుల ఉద్దేశం ఏమిటన్నది అర్థమైపోతూనే ఉంది. మొదట్లో ఈ దుర్ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిందనో, వ్యాపార కక్షల వల్ల జరిగిందనో భావించారు. కొద్దిపాటి దర్యాప్తు అనంతరం దుండగుల అసలు ఉద్దేశం అర్థమైపోయింది. ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన తరువాత మాత్రమే ఈ పేలుడు వెనుక ఐఎస్ఐ హస్తం ఉందన్న సంగతి బయటపడింది. బెంగళూరు పోలీసులు తమ దర్యాప్తులో ఇది కుక్కర్ పేలుడనీ, నాలుగేళ్ల కిందట .. అంటే 2020 మంగళూరులో జరిగిన కుక్కర్ పేలుడుకూ పోలిక ఉందని తెలిపారు అప్పుడు ఉపయోగించిన పేలుడు పరికరాన్ని, పేలుడు పదార్థాన్ని, టైమర్ నే ఇప్పుడు కూడా ఉపయోగించడం జరిగిందని చెబుతున్నారు. బెంగళూరు పేలుడుపై దర్యాప్తు ప్రారంభించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోయంబత్తూరు పేలుళ్లకు, బెంగళూరు, మంగళూరు పేలుళ్లకు సంబంధం ఉందని, పేలుడు జరిగిన తీరును బట్టి ఇది ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్) వ్యవహారంగా స్పష్టమౌతోందని వెల్లడించింది.
కానీ బెంగళూరు పోలీసులు మాత్రం ఐఎస్‌ఐ ప్రమేయాన్ని కొట్టి పారేస్తున్నారు. వ్యవహారమన్న అభిప్రాయానికి రాలేమని, తాము అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మామూలుగా ఉగ్ర దాడులు వంటి విషయాలలో ఎన్ఐఏ దర్యాప్తుపైనే విశ్వసనీయత ఉంటుంది. కానీ రాజకీయ కారణాలతో కర్నాటక ప్రభుత్వం నగర పోలీసుల అభిప్రాయాన్నే పెద్దగా ప్రచారం చేస్తున్నది. బెంగళూరు లాంటి ప్రశాంతమైన నగరంలో ఐఎస్ఐ దాడులు జరిగే అవకాశం లేదని ఆ రాస్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు. తొలుత ఆయన కూడా ఇది కుక్కర్ బాంబు పేలుడేనని ప్రకటన కూడా జారీ చేశారు. అయితే ఎన్ఐఏ దర్యాప్తులో బెంగళూరు రామేశ్వరం కేఫ్ సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని కడపలో అరెస్టు చేడయమే కాదు, అతడు పి.ఎఫ్.ఐకి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. పి.ఎఫ్.ఐకి, ఐ.ఎస్ కి సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే.
నిజానిjr బేంగళూరు పేలుడు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగక ముందే బెంగళూరు పోలీసులు కుక్కర్ బాంబు పేలుడుగా ప్రకటించేయడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే చెప్పేయడం తొందరపాటే అవుతుంది. ఎన్నికల వేళ దేశంలో ఉగ్రకదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. బెంగళూరు పేలుడు ఘటనలో రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాట కోసం ప్రయత్నించే కంటే.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. అలాగే బేంగళూరు ఘటనలో నిజానిజాలు బయటపడేంత వరకూ దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడమే మంచిది.