పసుపు పాలు ఎవరు ఎలా తాగాలి? ఎలా తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే..
posted on Sep 19, 2024 @ 9:30AM
పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే..
రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు. ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సీజన్ ఏదైనా తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది.
పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు, నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి.
పసుపును వందల ఏళ్ళ నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే..
సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.
మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో చిటికెడు జాజికాయ కూడా కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తయారుచేసేటప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు.
పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.
*నిశ్శబ్ద.