లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా...
posted on Sep 6, 2023 @ 1:36PM
ఎసెన్షియల్ ఆయిల్స్ గత కొంతకాలంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి ఒక్కరూ ఈ నూనెల సువాసనను ఇష్టపడతారు. ఇది కేవలం సువాసనే కాదు ఎన్నో సమస్యల్లో ఉపశమనం కూడా ఇస్తుంది. ఇది కాకుండా, ఈ నూనెలను ఏదైనా ఇతర నూనెతో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయవచ్చు, డిఫ్యూజర్‌లో ఉపయోగించవచ్చు లేదా వాసన చూడవచ్చు. ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ లో లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఒకటి. దీని అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుంటే..
ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది..
చర్మం నుండి బ్యాక్టీరియాను చంపడమే కాకుండా, లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. గోళ్ళలో ఫంగస్ లేదా చుండ్రు ఉన్నట్లయితే టీ ట్రీ ఆయిల్‌కు బదులుగా లెమన్ ఆయిల్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. దీన్ని చర్మంపై అప్లై చేయడమే కాకుండా, ఎయిర్ డిఫ్యూజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని సువాసన గదిలో ఉండే ఫంగస్ మరియు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది.
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు..
లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నుండి రక్షిస్తాయి. నిమ్మకాయతో తయారు చేయబడిన ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా నుండి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుందని 2019లో చేసిన పరిశోధనలో కనుగొనబడింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ ను ఏదైనా ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ జాగ్రత్త వల్ల అలెర్జీలను నివారించవచ్చు.
గాయాలను త్వరగా నయం చేస్తుంది..
లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తో గాయాన్ని శుభ్రం చేయవచ్చు. అయితే ఇతర క్యారియర్ ఆయిల్ తో కలిపే వాడాలి. ఇది బ్యాక్టీరియాను తొలగిస్తుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది.
చలికాలానికి ది బెస్ట్..
చలికాలంలో తలనొప్పి, జలుబు కారణంగా తలంతా బరువుగా ఉన్నా, గొంతులో నొప్పి, వాపు వంటి సమస్య ఉన్నా లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ నూనెను డిఫ్యూజర్‌లో ఉపయోగించడం వల్ల దాని సువాసన శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఓ రకంగా అరోమా థెరపీ అనుకోవచ్చు. ఇది గొంతులో వాపు, నొప్పిని తొలగిస్తుంది. అదే సమయంలో, ఇందులో ఉండే విటమిన్-సి జలుబ, ఫ్లూ నుండి ఉపశమనం ఇస్తుంది.
వికారం వదిలించుకోవడానికి..
వికారం బాధపెడుతుంటే, నిమ్మ నూనె సహాయం చేస్తుంది. గర్భిణీ స్త్రీలలో కూడా కలిగే వేవిళ్ళు, ఇతర సందర్భాలలో సాదారణ ప్రజలకు ఎదురయ్యే వికారానికి ఈ నూనె చక్కగా సహాయపడుతుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది..
నిమ్మ నూనె సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సువాసన ఆందోళన, టెన్షన్‌ని దూరం చేస్తుంది. దీనివల్ల రిలాక్స్‌గా ఉండచ్చు. సాధారణంగా లావెండర్ లేదా రోజ్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు, అయితే నిమ్మ నూనె ఈ రెండు నూనెల కంటే మెరుగైనది.
చర్మానికి మేలు చేస్తుంది..
చర్మంపై మొటిమలు, చీము తగ్గించడానికి లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇది సహజంగానే రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది. చర్మం మీది మృత కణాలను శుభ్రపరచడం, మూసుకుపోయిన రంధ్రాలను తెరవడం ద్వారా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేసి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. అయితే నిమ్మకాయ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి.
*నిశ్శబ్ద.