అరటిపండే కదా అని లైట్ తీసుకుంటారేమో.. దీని లాభాలు తెలిస్తే షాకవుతారు..!
posted on Aug 16, 2025 @ 12:09PM
ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు. అందుకే చాలామంది పండ్లు తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లే పండ్లలో అరటికే ప్రథమ స్థానం ఉంటుంది. కేవలం ఇలా తీసుకెళ్లడమే కాదు.. ఏ పూజ అయినా, శుభకార్యం అయినా అరటిపండ్లకే ఓటేస్తారు. రోజుకొక అరటిపండు తినాలని చాలామంది ట్రై చేస్తారు. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు. అరటిపండ్లు ధర కూడా చాలా తక్కువ. అయితే అరటిపండ్లు చవగ్గా లభిస్తాయని, అందరికి అందుబాటులో ఉంటాయని చాలా చులకనగా చూస్తారేమో.. కానీ అరటిపండ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే షాకవుతారు.
అరటి పండు చాలా చవకగా లభించే పండు. కానీ ఒక అరటిపండు తిన్నారంటే దాదాపు గంటకు పైగా ఆకలిని భరించవచ్చు. పైగా ఇందులో పోషకాలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. అందుకే వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు అరటిపండును వ్యాయామానికి ముందు లేదా తరువాత తప్పకుండా తీసుకుంటారు. అరటిపండు లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు రోగులకు అరటిపండు ఎంతో మేలు చేస్తుంది.
అరటిపండును చిన్న పెద్ద ఎవ్వరైనా తినగలుగుతారు. వృద్దులకు, దంతాలు లేని వారికి కూడా అరటి ఎంచుకోదగిన పండు. అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
నీరసంగా అనిపించినప్పుడు ఒక్క అరటిపండు తిన్నారంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలసటగా అనిపించినప్పుడు అరటిపండు తినడం ప్రయోజనకరంగా భావించడానికి ఇదే కారణం. అంతేకాదు.. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అరటిపండు తీసుకోమని చెబుతుంటారు. అది కూడా శరీరానికి శక్తి లభించాలనే..
అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది .
నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు అరటిపండు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందట. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...