జగన్ కోసం పాదయాత్ర చేసిన బసవారావు.. తెలుగుదేశం గూటికి
posted on Apr 12, 2024 @ 11:35AM
ఎన్నికల వేళ వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి. ఇలా పార్టీ మారిపోతున్న వారిలో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వీర భక్తులూ కూడా ఉండటం గమనార్హం. తాజాగా ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడు, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవారావు తెలుగుదేశం గూటికి చేరారు.
మంగళగిరి నియోజకవర్గ వరిధిలోని కురగాళ్ల గ్రామానికి చెందిన బసవారావు జగన్ కు మద్దతుగా గతంలో ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ రెండు వేల కిలో మీటర్ల పాదయాత్ర కూడా చేశారు. అయితే జగన్ అస్తవ్యస్థ పాలన, అడ్డగోలు విధానాలకు విసిగిపోయానని పేర్కొంటూ గురువారం ( ఏప్రిల్ 11) తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు పలువురు వైసీపీ మద్దతు దారులు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా బసవారావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక నాయకుడు చంద్రబాబేనని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా దళితులు అని చెప్పుకునే జగన్ ఏకంగా27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. అధికారంలోకి రాబోయేది తెలుగుదేశమే ననీ, తెలుగుదేశం పాలనలో దళితులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ వైసీపీ శిబిరం ఖాళీ అవుతోంది. ముఖ్యంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నది. అన్ని వర్గాలలోనూ వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.