బండ్ల గణేష్.. ఆ గట్టునున్నావా?.. ఈ గట్టునున్నావా?
posted on Oct 4, 2022 8:04AM
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందంటారు. మనవూరి పాండవులు అనే సినిమాలో ముళ్ల పూడి వారి డైలాగ్ ఒకటి ఉంటుంది. అన్నీ వేటి కూతలు అవి కూస్తే.. నువ్వు మాత్రం అన్నిటి కూతలూ కూస్తావు అని అర్ధం వచ్చే డైలాగ్ అది. ఇప్పుడు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తీరు అలాగే ఉంది. ఏపీలో రెండు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి బండ్ల గణేష్ అవసరాన్ని బట్టి ఒక్కో పార్టీ మాట మాట్లాడుతున్నారని అంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏవో చిన్న చిన్న కామెడీ పాత్రలు వేసుకుంటూ లాగిస్తూ హఠాత్తుగా నిర్మాత అవతారం ఎత్తిన బండ్ల గణేష్ జనసేనాని పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలితేనే తెగ హడావుడి చేసే బండ్ల గణేష్ రాజకీయంగా మాత్రం పవన్ కల్యాణ్ తో అడుగులు కలిపి నడవడం లేదు. గతంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన అడుగులు వైసీపీ వైపు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ స్వయంగా బండ్ల గణేష్ అటువంటి ప్రకటన ఏదీ చేయకపోయినా.. వైసీపీ నేతలతో ఆయనకున్న సంబంధాలు, పరిచయాలు మాత్రం బండ్ల గణేష్ అడుగులు వైసీపీ వైపే అని చెప్పకనే చెబుతున్నాయి. బండ్ల గణేష్ అంటేనే వివాదానికి కేరాఫ్ అడ్రస్ అని సినీ వర్గాల్లోనే చెప్పుకుంటుంటారు.
ఆయన అడుగేస్తే కాంట్రవర్సి, ఆయన మాట్లాడితే కాంట్రవర్సి, ఆయన మౌనంగా ఉంటే కాంట్రవర్సి.. కాట్రవర్సి..కాంట్రవర్సి..కాంట్రవర్సి అన్నట్లుగా ఉంటుంది బండ్ల గణేష్ తీరు. బండ్లగణేష్ సామాజిక మాధ్యమంలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు. మా ఎన్నికల సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, విమర్శలూ అప్పట్లో సెన్సేషన్. పవన్ కల్యాణ్ తనకు సినిమా తీసే చాన్స్ ఇస్తే వేయికోట్ల వసూళ్ల రేంజ్ ఎలా ఉంటుందో చూపుతానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా సంచలనం సృష్టించాయి. అటువంటి బండ్ల గణేష్ జనసేనలో కాకుండా వైసీపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలే ఆయన ఇక్కడ మాటలు ఇక్కడ, అక్కడి మాటలు అక్కడా చెబుతున్నారా అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన లైవ్ లోనే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ తో లైవ్ లోనే ఫోన్లో మాట్లాడిన తీరు, ఆ సంభాషణలో మాజీ మంత్రితో బండ్ల గణేష్ కు ఉన్న చనువు చూస్తుంటే.. వైసీపీ నేతలతో ఆయనకు చక్కటి అనుబంధం, అండర్ స్టాండింగ్ ఉందని పించేలా ఉన్నది. పైగా వైసీపీ నేతలతో బండ్ల గణేష్ అనుబంధం గురించి గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. బండ్ల గణేష్ నిర్మాతగా మారేందుకు, ఆయన ఎదిగేందుకు వైసీపీ ‘సహకారం’ మెండు అని ఇండస్ట్రీలోనే చెప్పుకుంటుంటారు. తాజాగా ఆయన చనువుగా మాజీ మంత్రికి ఫోన్ చేసి మరీ మాట్లాడటం దానినే ధృవపరిచింది.
పవన్ కల్యాణ్ గురించి వేదికలెక్కీ, సామాజిక మాధ్యమం వేదికపైనా ప్రసంగాలు దంచే బండ్ల గణేష్ రాజకీయం వద్దకు వచ్చే సరికి వైసీపీవైపే మొగ్గు చూపుతున్నారనీ, దీని వెనుక కారణం ఏమిటన్నది అంతుబట్టకుందనీ బండ్ల గణేష్ సన్నిహితులే అంటున్నారు. ఏది ఏమైనా సినిమాల వరకూ పవన్ కల్యాణ్ రాజకీయాల వద్దకు వచ్చే సరికి బండ్ల గణేష్ కు వైసీపీలోనే తన భవిష్యత్ కనిపిస్తున్నట్లుందని సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి.
చూస్తుంటే తన బాస్ అయిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనను వదిలేసి వైసీపీలోకి బండ్ల గణేష్ చేరేలానే ఉన్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాల పరంగా పవన్ ను అభిమానించే బండ్ల.. రాజకీయంగా మాత్రం వేరే అడుగులు వేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ బండ్ల గణేష్ రాజకీయాలు ఎటువైపు సాగుతున్నాయది.?