బండి పదవి పదిలం.. ఎన్నిల సారధి ఆయనే
posted on Jan 18, 2023 @ 9:47AM
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మరో రెండేళ్ళ పాటు అదే పదవిలో కొనసాగుతారు. బీజేపీ ఆయన సారధ్యంలోనే తెలంగాణ 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కుంటుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మంగళవారం(జనవరి 17)తో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ సంస్థాగత మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా, ఈ సంవత్సరం (2023)లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులను మార్చరాదని బీజేపీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్తుత అధ్యక్షులనే 2024 లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని సూత్రప్రాయంగా బీజేపే జాతీయ కార్యవర్గం నిర్ణయించింది. దీంతో,ఇంతవరకు సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెర పడింది. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తారనే ఊహాగానలకూ జాతీయ కార్యవర్గం తెర దించింది. మరో నలుగు రోజుల్లో రెండేళ్ళ పదవీ కాలం ముగుస్తున్న పార్టీ అధ్యక్షుడు జీపీ నడ్డా పదవీ కాలన్ని మరో రెండేళ్ళు పొడిగించాలని కార్యవర్గం నిర్ణయించింది.
అదలా ఉంటే బండి అధ్యక్ష పదవిలో కొనసాగడం ఖాయమైన నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే విషయంలో కొత్త చర్చ తెరపై కొచ్చింది. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలలో పాత కాపులు ఇద్దరికీ పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కాబినెట్ లో స్థానం దక్కితే బండి సంజయ్’ పార్టీ అధ్యక్షినిగా కొనసాగుతున్నారు. కాగా, 2019 ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబు రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లో ఒకరికి మంత్రి పదవి దక్క వచ్చని అంటున్నారు. అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో గిరిజన ఎంపీ సోయం బాబూ రావును మంత్రి పదవి వరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గత విస్తరణలోనే ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి క్షణంలో వచ్చిన అవకాశం చేజారి పోయింది. సో .. ఈ సారి బాబూ రావుకు బెర్త్ ఖాయమని అంటున్నారు.
అయితే యూపీ నుంచి రాజ్య సభకు ఎన్నికైన మరో పాతకాపు, డాక్టర్ కే. లక్ష్మణ్ పేరు కూడా తెలంగాణ కోటాలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పదవులన్నీ పాత వారికే ఇస్తే కొత్తగా వచ్చే వారిలో ఆసక్తి లేకుండా పోతుందని, రావాలనుకునే వారికీ తప్పుడు సంకేతం వెళుతుందని అదుకే గిరిజన ఎంపీ సోయం బాబూ రావుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాగే,ఈటల రాజేందర్ కు కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అలాగే, మంత్రివర్గ విస్తరణ తర్వాత పార్టీలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.