కేసీఆర్ ఢిల్లీ టూర్‌తో బీజేపీలో టెన్షన్.. బండి సంజయ్ మాటల్లో భయం!
posted on Sep 9, 2021 8:58AM
జస్ట్ బిల్డింగ్ ఓపెనింగ్‌కు ఢిల్లీ వెళ్లారు. అంతే. ఆ తర్వాత వెంటనే హైదరాబాద్ తిరిగి వచ్చేయాలి. కానీ, ఢిల్లీ వెదర్ బాగా నచ్చినట్టుంది. అక్కడే తిష్ట వేశారు సీఎం కేసీఆర్. వెళ్లినాయన ఊరికే ఉండక.. వెదర్ ఎంజాయ్ చేయగా.. ప్రభుత్వం తరఫున రాజకీయ పర్యటన చేపట్టారు. పీఎం మోదీని అపాయింట్‌మెంట్ అడిగారు. ఆయన వెంటనే ఇచ్చేశారు. దాదాపు గంట ముచ్చట పెట్టారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్‌షాను కలుస్తానన్నారు. ఆయనా రండి రండి అంటూ వెల్‌కమ్ చెప్పారు. వెళ్లి కలిశారు. ఆ తర్వాత పలువురు మంత్రులతో మిలాఖత్. ఇలా సీఎం కేసీఆర్ ఢిల్లీలో తెగ బిజీగా ఉన్నారు. ఏపీ సీఎం జగన్ పలుమార్లు ఢిల్లీలో మకాం వేసి.. కేంద్రం పెద్దల దర్శనం కోసం ఎంత పాకులాడినా.. ముఖం చాటేసేవారే కానీ.. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ మాత్రం ఇచ్చేవారు కాదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రికి మాత్రం ఇలా అడగ్గానే.. అలా రెడ్ కార్పెట్ పరిచేశారు కేంద్ర ప్రభుత్వ ప్రముఖులంతా. దీంతో.. టీఆర్ఎస్, బీజేపీ దొందు దొందేనంటూ కాంగ్రెస్, సీపీఐలు విమర్శలు గుప్పించాయి. నిజమేనా..? కారు-కమలం దోస్తులేనా? అనే సందేహం అందరిలోనూ. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీలో కేసీఆర్ నడుపుతున్న రాజకీయం తెలంగాణలో కాక రేపుతోంది.
కేసీఆర్ ట్రాప్‌లో కమలనాథులు పదే పదే చిక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు. గతంలో గవర్నర్‌లుగా ఎంపికైన విద్యాసాగర్‌రావు, దత్తాత్రేయ లాంటి వారికి ఘనంగా సన్మానం చేసి బీజేపీ-టీఆర్ఎస్‌లు ఒక్కటేననే ప్రచారం జరిగేలా చేసి కమలనాథులను కొన్నాళ్ల పాటు డిఫెన్స్‌లో పడేశారు కేసీఆర్. ఆయన రాజకీయం అలానే ఉంటుంది మరి. తాజాగా, ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో ప్రగతి భవన్‌పై దండయాత్ర ప్రకటిస్తే.. హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్ కవ్విస్తుంటే.. కేసీఆర్ ఏమో ఢిల్లీ వెళ్లి ఎంచక్కా కేంద్ర పెద్దలను కలిసి.. మరో ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మంచి అవకాశం కల్పించారు. తాను మోదీని, అమిత్‌షాను కలిస్తే.. బీజేపీ-టీఆర్ఎస్ దొందు దొందేనని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తాయని ఆయనకు ముందే తెలుసు. అలా చేయాలనేదే కేసీఆర్ స్కెచ్. తామిద్దరం ఒకటేననే మెసేజ్ వెళితే.. బీజేపీ దూకుడు, ఉత్సాహమంతా నీరు కారిపోవడం ఖాయమనేది గులాబీ బాస్ వ్యూహం. పనిలో పనిగా కేంద్రానికి పలు అంశాల్లో డిమాండ్లు వినిపించి.. అవి నెరవేరకపోతే.. బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆ పార్టీని బద్నామ్ చేసేందుకు కూడా కేసీఆర్‌కు మంచి ఛాన్స్ చిక్కుతుంది. ఇలా, టూ టార్గెట్స్ ఎట్ వన్ టూర్.. అనేది కేసీఆర్ ఢిల్లీ పర్యటన లక్ష్యం అంటున్నారు.
కేసీఆర్ ఎత్తుగడను పసిగట్టిన బండి సంజయ్ అందుకు విరుగుడు మంత్రాన్ని వల్లెవేస్తున్నారు. పాదయాత్రలో ఉన్న బండి.. తాజాగా గులాబీ నేతలపై సంచలన కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తున్నారనే ఇంటలిజెన్స్ సమాచారంతోనే.. కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కాపాడుకోవడానికి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని తేల్చి చెప్పారు. బీజేపీతో తప్ప టీఆర్ఎస్ అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే టీఆర్ఎస్ వేసినట్లే అన్నారు. బండి సంజయ్ మాటల్లో ఆరోపణకంటే.. భయమే ఎక్కువ కనిపిస్తోందని అంటున్నారు. బీజేపీ-టీఆర్ఎస్ ఒక్కటి కాదని బలంగా చెప్పడానికే ఇలాంటి వ్యాఖ్యలు పదే పదే గట్టిగా వినిపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి, ఢిల్లీలో కేసీఆర్ విసిరిన వలకు చిక్కకుండా రాష్ట్ర బీజేపీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి...