బండి, అక్భర్ పై కేసులు! హాట్ కామెంట్లపై పోలీసుల యాక్షన్
posted on Nov 28, 2020 @ 11:36AM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 505 కింద కేసులు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో సామాజిక ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ.. పాతబస్తీలో రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని అన్నారు. ఇత పాతబస్తిలో జరిగిన ఓ సభలో మాట్లాడిన ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ.. హుస్సేన్ సాగర్‌ను ఆక్రమించి ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధులను నిర్మించారని, వాటిని కూల్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. అదే జరిగితే రెండు గంటల్లో దారుస్సలాం కూలిపోతుందని తీవ్రంగా స్పందించారు. వీరి సవాళ్లతో సామాజికంగా ఘర్షణలు రేకెత్తే ప్రమాదం ఉందంటూ పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు.