హీటెక్కిస్తున్న బండి సంజయ్ ట్వీట్
posted on Apr 26, 2023 @ 1:37PM
1970 బాలివుడ్ లో ఓ సినిమా వచ్చింది. ధారాసింగ్ బందిపోటుగా వచ్చిన ఈ సినిమా పేరు ‘‘చోరోన్ కే చోర్ ’’ సినిమా బాగా ఆడింది. ఈ ప్రస్తావన ఎందుకంటే ప్రస్తుత తెలంగాణా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉండటంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో షరా మామూలే. కానీ ఒకడుగు ముందుకేసి ఈ పర్వాన్ని మరింత వేడెక్కించే విధంగా మాట్లాడుతున్నారు. వ్యక్తులను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారుతున్నారు.
‘‘చోరోన్ కే చోర్ ’’ టైటిల్ మాదిరిగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ‘‘గ్యాంగ్ స్టర్ల గ్యాంగ్ స్టర్ ’’ అని సంభోధించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో తనను ఇరికించాడని కాక మీద ఉన్న బండి సంజయ్ బెయిల్ పై బయటకొచ్చి పబ్లిక్ మీటింగ్ లలో తండ్రీ కొడుకులపై దుమ్మెత్తి పోస్తున్నారు. యూపీలో గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కంటే కేసీఆర్ ప్రమాదకారి అని అన్నారు. బండి సంజయ్ బుధవారం ట్వీట్ చేసిన పదాలు చూస్తుంటే అవతలి వారిని మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కేసీఆర్ గ్యాంగ్ స్టర్లకే గ్యాంగ్ స్టర్ అంటూ కాంట్రవర్శీ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ఈ ట్వీట్ మీద బీఆర్ ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో మరి.