Read more!

మసాలా పౌడర్లలో ఇథిలీన్ ఆక్సైడ్... క్యాన్సర్ ప‌క్కా అంటున్న న్యూట్రీష‌న్లు

భారతీయ మసాలా పౌడర్లపై సింగపూర్ బ్యాన్ విధించింది. గ‌తంలోనూ అమెరికా భార‌తీయ మ‌సాలా బ్రాండ్ల‌ను మార్కెట్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌ని  అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది.  నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను సేక‌రిస్తున్న‌ట్లు స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. 

ఎవరెస్ట్, ఎండీహెచ్‌ తయారు చేసిన మసాలాలు వాడొద్దని సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఆ దేశ ప్రజలకు సూచించింది. ఈ కంపెనీల‌ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలను నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే....ఎండీహెచ్ మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా మిక్స్డ్ పౌడర్, కర్రీ ఫౌడర్ మిక్స్డ్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలలో పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించామని హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన 'సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ' సీఎఫ్ఎస్ చెప్పింది.  ఫెస్టిసైడ్ అవశేషాలున్న ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరం. ఇథిలీన్ ఆక్సైడ్ వంటి క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉంటే హాంకాంగ్ చ‌ట్టాల ప్ర‌కారం గరిష్టంగా 50వేల డాలర్ల జరిమానా విధిస్తారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

గ‌తంలోనూ అదే....2023లో ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆదేశించింది. వాళ్ళు చెప్పిందేమిటంటే ఈ సుగంధ ద్రవ్యాలలో సాల్మొనెల్లా ఉన్నట్లు అప్పట్లో గుర్తించారట‌. ఈ బ్యాక్టీరియా వల్ల అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం, వాంతులు అవుతాయి. 

అలాగే నెస్లే, సెరెలాక్  ఉత్పత్తులలో అదనపు చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. శిశువులకు అంత చక్కెర ఇవ్వడం మంచిది కాదని బెల్జియన్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.  ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్ సహకారంతో ఈ రిపోర్టు రూపొందించారు.  

“ప్రతి ప్రోడక్టు ఎగుమతి చేయడానికి ముందు, వాటిని స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుంది.  అయితే
 సింగపూర్, హాంకాంగ్‌ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ నాణ్య‌తా ప‌రీక్ష‌ల‌కు, బెల్జియన్ ల్యాబ్ నివేదికల‌కు, మ‌న‌ స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా టెస్ట్‌ల‌కు తేడా ఎందుకు వ‌చ్చింది? ఇదే చ‌ర్చ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. ఇండియాలో చేసే నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త క‌నిపించి, విదేశాల్లో జ‌రిపిన నాణ్య‌తా ప‌రీక్ష‌ల్లో నాణ్య‌త లేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని దేశ ప్ర‌జ‌లు మాట్లాడుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  దేశంలోని అన్ని తయారీ యూనిట్ల నుండి సుగంధ ద్రవ్యాల నమూనాలను సేకరించాలని ఫుడ్ కమిషనర్‌లను ఆదేశించింది. మసాలా దినుసుల నమూనాల సేకరణ ప్రక్రియ ఇప్ప‌ట్టికే ప్రారంభమైంది.  మూడు నాలుగు రోజుల్లో దేశంలోని అన్ని సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ల నుంచి నమూనాలను సేకరిస్తామ‌ని కేంద్ర‌ ప్రభుత్వ ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

భారతదేశంలోనూ ఆహార పదార్థాలలో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకంపై నిషేధం ఉంది.  ఒక వేళ మసాలా దినుసుల్లో హానికరమైన పదార్థాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. తాము ఉత్ప‌త్తి చేసే ఉత్పత్తులకు, హానికరమైన అంశాలు జోడించరాదని అవగాహన కల్పించాలని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సుగంధ ద్రవ్యాల బోర్డుకు భార‌త ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.  భారతీయ బ్రాండ్‌లకు చెందిన నాలుగు సుగంధ ద్రవ్యాలు-మిక్స్ ఉత్పత్తుల అమ్మకాలపై హాంకాంగ్ మరియు సింగపూర్ విధించిన నిషేధాన్ని పరిశీలిస్తున్నట్లు  స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు.

ఇథిలీన్ ఆక్సైడ్ ఆరోగ్యంపై తీవ్ర‌ ప్రభావం చూపుతుందని  ఎబి రెమ శ్రీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇథిలీన్ ఆక్సైడ్‌ను 'గ్రూప్ 1 కార్సినోజెన్'గా వర్గీకరించిందని ఆమె చెప్పారు. అంటే "ఇది మానవులలో క్యాన్సర్‌కు కారణమవుతుంది.  మానవ కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కళ్ళు, చర్మం, ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులు చికాకు కలిగించ‌డంతో పాటు మెదడు,  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దేశంలోని అన్ని మసాలా తయారీ కంపెనీల నుండి నమూనాలను తీసుకుంటామని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎబి రెమ శ్రీ తెలిపారు. మరో 20 రోజుల్లో ల్యాబ్ నుండి నివేదిక వస్తుంది. అనంతరం ఆయా బ్రాండ్లపై చర్యలను ఖరారు చేయనున్నారు. 

- ఎం.కె.ఫ‌జ‌ల్‌