బాలినేనిదీ ఆర్కే దారేనా?
posted on Jan 19, 2024 @ 11:35AM
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జగన్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతకు తోడు.. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న సిట్టింగుల మార్పు పేరుతో చేస్తున్న ప్రయోగం ఆ పార్టీలోని ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన, ఆవేదన, ఆగ్రహం నింపుతోంది. దీంతో రోజు రోజుకూ చాప కింద నీరులాగా పార్టీ నేతల్లో అసంతృప్తి విస్తరిస్తోంది. పార్టీ వదిలి వెళ్లేందుకు రెడీ అవుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అలా పార్టీ మారే యోచన చేస్తున్న వారి జాబితాలోకి తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా చేరింది.
జగన్ తీరు కారణంగా చాలా కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. ఇక ఇప్పుడు జగన్ కు బైబై చెప్పేయడానికే నిర్ణయించుకున్నారు. సిట్టింగుల మార్పు అంటూ జగన్ తన సీటు మార్చడానికి నిర్ణయించుకోవడం బాలినేనిలో ఇహ పార్టీలో ఉండి, జగన్ వెంట నడిచి లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే జగన్ తీరుతో విసిగి పార్టీని వీడి షర్మల వెంట అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్కే అంటే జగన్ కు అనుంగు శిష్యుడు, సన్నిహితుడిగా పేరు ఉంది. అలాంటి ఆర్కే పార్టీని వీడి జగన్ కు వ్యతిరేకంగా షర్మిల వెంట కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయిపోయారు. ఇప్పుడు జగన్ సమీప బంధువు బాలినేని కూడా ఆర్కే బాటలోనే అడుగులు వేయడానికి రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సోమవారం (జనవరి 21) కాంగ్రెస్ రాష్ట్ర సారథిగా షర్మిల బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఆమె అలా బాధ్యతలు చేపట్టగానే ఇలా బాలినేని ఆమెతో భేటీ రెడీ అవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. బాలినేనికి వైయస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. ఆ కారణంతోనే తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టి పాదయాత్ర ప్రారంభించగానే.. అప్పటికి ఏపీ మంత్రిగా ఉన్న బాలినేనిబాలినేని వెళ్లి.. ఆమెకు అభినందనలు చెప్పడమే కాకుండా టేక్ కేర్ అంటూ జాగ్రత్తలు చెప్పి వచ్చారు.
ఆ తర్వాత ఇదే కారణంతో సీఎం జగన్‌కు బాలినేనిని తాడేపల్లి ప్యాలెస్‌కు దూరం పెట్టడమే కాకుండా ఆయనను కేబినెట్ నుంచి కూడా తొలగించేశారని అప్పట్లో పార్టీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే తన కుమార్తె షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఆరా తీసేందుకు వైఎస్ విజయమ్మ ఇటీవల ఒంగోలు వెళ్లి ఓ సిద్దాంతిని కలిశారు, ఆ తరువాత ఆమె బాలినేని నివాసానికి ఆమె వెళ్లారు. దీంతో జగన్ కు బాలినేనిపై మరింత ఆగ్రహం పెరిగిందనీ, అందుకే వచ్చే ఎన్నికలలో బాలినేనికి ఒంగోలు టికెట్ నిరాకరిస్తున్నారన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
అదలా ఉంచితే ఆంధ్రప్రదేశ్‌లో హస్తం పార్టీ పగ్గాలు వైయస్ షర్మిల చేపట్టడంతో.. వైసీపీలోని అసంతృప్తులందరూ దాదాపుగా ఆమె వెంటే నడవనున్నారనే ఓ ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా ఉంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ బాటలోనే నడుస్తున్నారు. నేడో రేపో బాలినేని సైతం నేను సైతం షర్మిల వెంటే అంటూ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఏదన్నది కాదు, తాను మాత్రం ఒంగోలు నుంచే బరిలోకి ఉంటానని బాలినేని చేసిన ప్రకటనను ఉదహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగాజగన్‌ను కలిసేందుకు బాలినేని చేసిన ప్రయత్నాలు పలించకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం, జగన్ ను ఇక కలిసేదేలేదని శపథం చేసి మరీ హైదరాబాద్ వెళ్లిపోవడం తెలిసిందే. అయితే సంక్రాంతి పండగ వేళ.. జగన్ పిలుపునందుకుని బాలినేని విజయసాయిరెడ్డితో కలిసి జగన్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ కేటాయింపుపై బాలినేని జగన్ ను నిలదీస్తే... ఆయన సంగతి పక్కన పెట్టి మీ పోటీ ఒంగోలు నుంచా, గిద్దలూరు నుంచా అన్నది తేలాల్సి ఉందని చెప్పడంతో కంగుతిన్న బాలినేని భేటీ ముగిసిన తరువాత మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ తో తెగతెంపులు చేసేసుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ కు సరైన రిటార్డ్ ఇవ్వాలంటే షర్మిల కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ లో చేరి ఆమెకు అండగా నిలవడమే సరైన నిర్ణయంగా బాలినేని భావిస్తున్నట్లు చెబుతున్నారు.