తగ్గినట్టే తగ్గి తిరగబడ్డ బాలినేని!?
posted on Jan 31, 2024 @ 11:39AM
పొమ్మని చెప్పలేక జగన్.. పొగపెట్టినా పోలేక బాలినేని, ధిక్కరించినా చర్య తీసుకోలేక జగన్.. అవమానించినా వదిలేసి వెళ్లలేక బాలినేని.. ఇలా గత కొంత కాలంగా జగన్ బాలినేని మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ నడుస్తోంది. మొత్తంగా బాలినేని వ్యవహారం వైసీపీకి చిక్కులు తెచ్చిపెట్టడమే కాకుండా, ప్రకాశం జిల్లాలో పార్టీ పుట్టి ముంచడం తథ్యమన్న భావన కూడా కలిగిస్తోంది. తాజాగా బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ విషయంలో రాజీపడిన జగన్.. జిల్లాలో తాను చెప్పిన వారందరికీ టికెట్లు ఇచ్చి తీరాలి, మరీ ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి మాగుంటకు టికెట్ ఇవ్వాలన్న బాలినేని డిమాండ్ ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని జగన్ తేల్చేశారు.
అదే విషయం బాలినేనికి చెప్పి బుజ్జగించి రమ్మంటూ పార్టీలోకి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను పంపారు. ఎవరి విషయంలోనూ లేనట్టుగా బాలినేని విషయంలోనే జగన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు వెనుకలాడటానికి కారణం.. బాలినేని అలకపాన్పు ఎక్కిన ప్రతిసారీ బతిమలాటలు, బుజ్జగింపులు చేయడానికి కారణం బాలినేని పార్టీ వీడితే ఒంగోలులో వైసీసీ అడ్రస్ గల్లంతౌతుందన్న భయమే కారణమని పరిశీలకులు అంటారు. అయితే గత సోమవారం(జనవరి 29) సీఎంవోకు వచ్చిన బాలినేని నిమిషాల వ్యవధిలోనే.. కనీసం కారు కూడా దిగకుండానే వెనుదిరగడంతో ఆయన ఇక తెగేదాకా లాగేందుకు సిద్ధపడిపోయారని తేటతెల్లమైపోయింది.
అప్పటి వరకూ అలకబూనితే బుజ్జగించి సముదాయించవచ్చన్న ఉద్దేశంతో ఉన్న జగన్ ఇక బాలినేని పార్టీతో తెగతెంపులు చేసేసుకుంటారన్న అనుమానంతో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను రంగంలోకి దింపి మరో సారి బుజ్జగింపు డ్రామాకు తెరతీశారు. అయితే ఈ సారి మాత్రం బాలినేని బుజ్జగింపులకు, సముదాయింపులకు లొంగలేదని తెలుస్తోంది.
సజ్జల, విజయసాయిరెడ్డి దాదాపు గంట సేపు బాలినేనితో జరిపిన చర్చలు సఫలం కాలేదని అంటున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో బాలినేని మెట్టు దిగలేదనీ, పట్టు వీడలేదని తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదన్న జగన్ మాటను సజ్జల, విజయసాయిలు బాలినేనికి తేల్చి చెప్పారట. ఒక వేళ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కాకపోతే, ఆయన కుమారుడు మాగుంట భార్గవ కు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని బాలినేని చేసిన ప్రతిపాదన కూడా జగన్ కు ఆమోదయోగ్యం కాదని తేలడంతో సజ్జల, విజయసాయిల రాయబారం విఫలమైంది. దీంతో వారు బాలినేని నివాసం నుంచి నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు.
అలాగే సజ్జల, విజయసాయిలతో భేటీ అనంతరం బాలినేని హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ భేటీ తరువాత ఇక బాలినేని తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. అదే సమయంలో వైసీపీ ఒంగోలు పార్లమెంటు స్థానం తప్ప.. అంటూ బాలినేనికి మరిన్ని ఆప్షన్లు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద బాలినేని తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా తిరగబడటంతో వైసీపీ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.