ఆరోగ్యం కోరుకొంటున్న బాలకృష్ణ
posted on May 27, 2014 9:17AM
హిందూపురం నుండి ఎన్నికయిన బాలకృష్ణ తను కూడా మంత్రిపదవి చెప్పట్టాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. బహుశః ఆయన కూడా చంద్రబాబుతో బాటే జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన తనకు ఆరోగ్యశాఖను కోరుకొంటున్నట్లు తెలుస్తోంది. ఎందువలన అంటే ఆయన చాలా కాలంగా హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అప్పటి నుండే ఆయనకు నిరుపేద ప్రజలకు కూడా మెరుగయిన వైద్య సేవలు అందించాలనే తపన ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా తనకు అవకాశం దక్కినట్లయితే గ్రామీణ ప్రాంతాలకి కూడా ఉన్నత వైద్య సదుపాయాలు విస్తరించాలని రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలను పెంచి వాటి పనితీరును మెరుగుపరిచి, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకానికి మరిన్ని మెరుగులు దిద్ది అర్హులయిన ప్రజలందరికీ దానిని అందించాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కానీ, ఇటువంటి ముఖ్యమయిన శాఖ నిర్వహణకు మంచి అనుభవం, అవగాహన, కార్యదక్షత అవసరం. బాలయ్యకు సినీ పరిశ్రమ కష్టసుఖాల గురించి మంచి అవగాహన ఉన్నందున, చంద్రబాబు ఆయనకు సమాచార, ప్రసార శాఖ లేదా అటువంటి శాఖనే ఈయవచ్చును.