హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
posted on Nov 1, 2023 @ 5:17PM
స్కిల్ కేసులో హైకోర్టు మధ్యంతర బెయిలుతో మంగళవారం (అక్టోబర్ 31) రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన నారా చంద్రబాబునాయుడు..అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తన నివాసానికి బుధవారం(నవంబర్1) ఉదయం చేరుకున్న సంగతి తెలిసిందే. దారి పొడవునా ఆయనకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజమహేంద్రవరం నుంచి నాలుగు గంటలలో చేరుకోవాల్సిన చంద్రబాబు కాన్వాయ్ ఉండవల్లి చేరుకునే సరికి తెల్లావారి ఆరు గంటలు అయ్యింది. అంటే 14 గంటల సమయం పట్టింది.
దీనిని బట్టే దారి పొడవునా జనం ఆయనకు స్వాగతం పలకడానికి ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఉండవల్లి నివాసంలో సాయంత్రం వరకూ విశ్రాంతి తీసుకున్న చంద్రబాబు సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుని విమానంలో హైదరాబాద్ వచ్చారు. అక్కడ నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని తరువాత కంటి పరీక్షల నిమిత్తం ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెడతారు.
ఇలా ఉండగా గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకూ భారీ ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు సాయంత్రం 4.30 నుంచి కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం నాయకుడు, శ్రేణులే కాకుండా చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులూ కూడా పాల్గొన్నారు.