కుప్పం పర్యటన ముంగిట..బాబు ప్రచార రథం డ్రైవర్ అరెస్టు..
posted on Jan 4, 2023 @ 11:15AM
వైసీపీ చీకటి జీవో లక్ష్యమేమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు ప్రచార రథం డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే జగన్ సర్కార్ ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించిందన్నది ఈ అరెైస్టుతో తేలిపోయింది. నిషేధం అమలులో ఉన్నా చంద్రబాబు పర్యటన సాగిస్తే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం తథ్యమన్నసమాచారంతోనే.. రోడ్ షోకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేకుండా చేయాలన్నఉద్దేశంతోనే ఆయన ప్రచార రథం డ్రైవర్ ను అరెస్టు చేశారని తెలుగు దేశం శ్రేణులు అంటున్నాయి.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ రాజమండ్రి, ఉత్తరాంధ్రలో వేలాది మందిలో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు కుప్పం విషయం వచ్చే సరికి నిషేధం విషయం పోలీసులకు గుర్తు వచ్చింది. చంద్రబాబు కుప్పంలో నిర్వహించనున్నరోడ్ షో, సభలకు అనుమతి లేదంటూ మంగళవారం (జనవరి 3) రాత్రి చంద్రబాబు వ్యక్తిగతకార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు.
అంతకముందు చంద్రబాబు పర్యటనపై పలమనేరు డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. జీవో నెం.1 ప్రకారం సభలపై ముందుస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఇరుకు సందుల్లో, నేషనల్ హైవేలపై సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సభలు, రోడ్ షోల వివరాలను అందించాలని సూచించారు. దీనిపై పోలీసులకు టీడీపీ నేతలు..చంద్రబాబు పర్యటనపై వివరాలు అందించారు.
అయితే చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శికి ఇచ్చిన నోటీసుపై సమాధానం ఇవ్వడం ఆలస్యమైందని రోడ్ షోలు, సభలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. న్యాయ పరీక్షకు నిలబడని జీవోను విడుదల చేసి జగన్ సర్కార్ చంద్రబాబు పర్యటనలు అడ్డుకోవాలని చూస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్యటన జరిగి తీరుతుందని తెలుగుదేశం వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే రోడ్ షో కోసం రథాన్ని శుభ్రం చేస్తున్న డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.