ఏపీకి సాయం చేయాలంటూ ప్రధానికి లేఖ.. రాసిందెవరో తెలుసా?
posted on Dec 11, 2023 6:18AM
మిచౌంగ్ తుపాను ఏపీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 30లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. తుపాను ముగిసి రోజులు గడిచిపోయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం అందలేదు. సహాయం చేస్తామన్న ప్రకటనలకే ప్రభుత్వం పరిమితమైపోయింది. ముఖ్యమంత్రి పరామర్శ కూడా పరదాల చాటున సాగింది. వైసీపీ ప్రచార కార్యక్రమంలా జనసమీకరణ చేసి, ఓ సభ పెట్టి విపక్షంపై విమర్శలు గుప్పించి, ఆదుకుంటామంటూ ఓ హామీ పారేసి మమ అనిపించేశారు. విపత్తులు వస్తే ఇలా ఎలా వహరించగలుగుతున్నారని రైతులు విస్తుపోయారు. ప్రభుత్వం సహాయం చేసే పరిస్థితి ఎటూ లేదు కనీసం కేంద్ర నుంచి సహాయం పొందేందుకు ప్రయత్నం చేయాలన్న ధ్యాసా లేని సీఎం జగన్ విపక్షంపై విమర్శించడానికే తుపాను బాధితుల పరామర్శ అంటూ ఓ కార్యక్రమాన్ని పెట్టుకున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తాయి.
ఇక అంబటి లాంటి మంత్రులైతే.. విపక్షాన్ని విమర్శించడమే తుపాను కారణంగా నష్టపోయిన జనాలను ఆదుకోవడం అన్నట్లు వ్యవహరించారు. అలాంటి వేళ ప్రధానికి మిచౌంగ్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ ఓ లేఖ అందింది. ఆ లేఖ రాసింది. ముఖ్యమంత్రి కాదు. ఏపీ ప్రభుత్వం కాదు. మరి ఎవరు? విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు. తుపాను బాధితులను పరామర్శించిన ఆయన ఆ సందర్భంగానే కేంద్రం సాయం కోసం సీఎం ప్రధానికి, కేంద్రానికి విజ్ణప్తి చేయకపోవడాన్ని ఎత్తి చూపి ఆ పని తానే చేస్తానన్నారు. అలాగే చేశారు. నష్టం అంచనాలకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు. నష్టం తీవ్రంగా ఉందని.. లక్షల మంది రైతులు పంటనష్టపోయి కుదేలయ్యారనీ ఆ లేఖలో పేర్కొన్నారు. రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, తాగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ రంగాలకు అస్తవ్యస్థమైపోయాయి. ఆక్వా రంగం కూడా నష్టపోయిందని సాయం చేయాలని కోరారు.
ప్రజల పక్షాన నిలబడేందుకు అధికారంలో ఉండాల్సిన అవసరమే లేదనీ, వారిని ఆదుకోవాలన్న సంకల్పం చాలనీ చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన చంద్రబాబు.. కేంద్రానికి నష్టం వివరాలను కూడా బాధ్యతాయుతంగా అందించారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేయని పనిని తాను చేసి చూపారు. బాధలో ఉన్న వారిని ఓదార్చారు. అండగా ఉంటామన్న భరోసాను కల్పించారు. ధైర్యం చెప్పారు.
మరో వైపు తుపాను బీభత్సంతో రాష్ట్రం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫంక్షన్లలో బిజీగా ఉంటే.. ఆయన కేబినెట్ లో రోజా వంటి మంత్రులు రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ యమా బిజీగా ఉన్నారు. చంద్రబాబు ఆదేశం మేరకు తెలుగుదేశం శ్రేణులు తుపాను బాధితులకు సహాయ కార్యక్రమాలలో నిమగన్నమయ్యారు. ప్రజల కోసం నిలబడే నేత ఎవరో ఈ ఆపత్సమయంలో అందరికీ అర్ధమైందని జనం చెబుతున్నారు.