బాబు ఢిల్లీ టూర్.. కమలం స్కెచ్ లో భాగమేనా?
posted on Aug 18, 2022 6:58AM
తెలంగాణలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌కి చెక్ పెట్టి.. అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో బాబును మోడీ స్వయంగా పలకరించి, ఆప్యాయంగా మాట్లాడారా? శత్రువుకు శ్రుతువు మిత్రుడు అనే లాజిక్‌ను తెరపైకి తీసుకు వచ్చి.. మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంత్రాంగం నెరపేందుకు .. కమలం పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారా? అంటే.. రాజకీయ విశ్లేషకులు నుంచి అందుకు అవుననే సమాధానం వస్తోంది.
తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత ప్రదాని మోడీయే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించడమే కాకుండా పక్కకు తీసుకువెళ్లి కొద్ది సేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇది సమావేశానికి హాజరైన ప్రముఖులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిణామం విస్తృత చర్చకు తెర తీసింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత.. వీరిద్దరు ఎదురుపడటం ఇదే ప్రథమం. ఉప్పు నిప్పులా ఉండే ఇరువురూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం.. ప్రత్యేకంగా ముచ్చటించుకోవడంపై పరిశీలకులు పలు విశ్లేషణలు చేస్తున్నారు. గతంలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై అధికార ఫ్యాన్ పార్టీ నాయకులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అందుకు నిరసనగా చంద్రబాబు ఓ రోజు దీక్ష చేసి.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షాతో భేటీకి ప్రయత్నించారు. కానీ అప్పట్లో చంద్రబాబుకు ఇరువురూ కూడా అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన రెండు రోజులు వేచి చూసి .. ఆ తర్వాత వెనుదిరిగారు. ఆ తరువాత కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా.. మోడీ, అమిత్ షాలను కలిసే ప్రయత్నం చేయలేదు.. అలాగే వారు కూడా చంద్రబాబును అంతగా పట్టించుకోనూ లేదు. కానీ ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తెలుగుదేశం మద్దతు ప్రకటించడంతో కమలనాధుల మనస్సును చంద్రబాబు మరోసారి గెలుచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. ఆ అధికారాన్ని హస్త గతం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ రాష్ట్రంలో నేరుగా బీజేపీ రాజకీయాలు చేయడానికి అట్టే సమయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో గత టీడీపీ నాయకులంతా కారు పార్టీలో చేరి.. సీఎం కేసీఆర్‌కి కోటరీగా మారిపోయారు. కానీ తెలంగాణలో సైకిల్ పార్టీ కేడర్ మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. కేసీపీ సిమెంట్‌తో కట్టిన నిర్మాణంలాగా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.
ఇప్పుడు ఆ క్యాడర్ బలంపైనే బీజేపీ ఆశలు పెంచుకుంటోంది. ఏపీలో చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. ఆ ప్రభావం తెలంగాణలో తెలుగుదేశం క్యాడర్ బీజేపీకి అండగా నిలిచేలా చేస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తెలుగుదేశం క్యాడర్ అండతో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న వ్యూహంతో ఉందని పరిశీలకులు అంటున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశంతో మైత్రి ఉంటే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా కొన్ని జిల్లాలలో తెలుగుదేశం బలం తమకు తోడ్పడుతుందని కమలనాథులు భావిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో కీసీఆర్ అధికారానికి వచ్చే ఎన్నికలలో చెక్ పెట్టాలంటే చంద్రబాబు అండ అవసరమని బీజేపీ గుర్తించిందని అంటున్నారు.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుతో మోడీ తనంత తానుగా మాట కలపడాన్ని చూస్తుంటే తెలంగాణలో పాగాకు స్కెచ్ లో భాగమేనని విశ్లేషిస్తున్నారు.
బీజేపీ స్కెచ్ లో భాగంగానే ఏపీలో తెలుగుదేశానికి సహకరిస్తే.. తెలంగాణలో కమలానికి సహకారం అందిస్తామని చెప్పడానికే చంద్రబాబు మళ్లీ హస్తిన పర్యటనకు బయలు దేరుతున్నారని పరిశీలకులు అంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే వారంలో ఆయన ఢిల్లీకి పయనమవనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ టూర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చోటు చేసుకున్న పరిణామాలు.. విపరీతంగా అప్పులు చేయడం.. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం.. దాడులకు దిగడం.. కేంద్ర పథకాలు.. తమ పథకాలంటూ జగన్ ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం తదితర అంశాలపై కేంద్రంలోని పెద్దలకు చంద్రబాబు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ మాసంలోనే చంద్రబాబు హస్తిన బాట పట్టే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మోదీతో చంద్రబాబు భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే రానున్నది ఎన్నికల సీజన్.. దాంతో రాజకీయ సమీకరణాలు సైతం మారనున్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు ఇటీవల ఢిల్లీలో మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశమనంతరం చంద్రబాబు, మోదీ.. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరు కలిసి మాట్లాడుకోవడంపై తెలుగు రాష్ట్రాల్లోని మీడియా పలు కథనాలను ప్రచురించింది.
అయితే వీరిద్దరు ఏం చర్చించుకున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. కానీ ఇటీవల పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్‌లో చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడుతూ.. ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించిన పలు అంశాలు వివరించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఒక్కొక్కరినీ పలకరిస్తూ తానే వద్దకు వచ్చారని చంద్రబాబు చెప్పారని.. మనం కలిసి చాలా రోజులైందని.. ఢిల్లీ రావడం లేదా? అని చంద్రబాబును మోదీ ప్రశ్నించారట. ఢిల్లీలో తనకు పనేమీ లేదని.. అందుకే రావడం లేదని మోదీకి చంద్రబాబు సమాధానం ఇచ్చారు.అలాగే మీతో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయని.. మనం ఒకసారి కలవాలని చంద్రబాబుతో మోదీ చెప్పారట.
తాను కూడా మిమ్మల్ని కలుద్దామనుకోంటున్నట్లు ఈ సందర్బంగా మోదీతో చంద్రబాబు చెప్పారట. ఓ సారి వీలు చూసుకుని ఢిల్లీ రావాలని.. మీరు వచ్చే ముందు నా కార్యాలయానికి సమాచారమిస్తే.. నాకు అనువుగా ఉన్న సమయం చెబుతానని మోదీ.. చంద్రబాబుతో పేర్కొన్నారని ఆయన స్వయంగా చెప్పారు. ఈ పరిణామాలను, చంద్రబాబు మరో సారి మోడీతో భేటీకి ఢిల్లీ పర్యటనకు సమాయత్తం అవుతుండటం గమనిస్తే.. తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం.. ఏపీలో తెలుగుదేశానికి బీజేపీ సహకారం అందించుకునే వ్యూహానికి ఇరు పార్టీలూ తెరతీసినట్లుగానే కనిపిస్తోంది.ఏదీ ఏమైనా చంద్రబాబు ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అయితే అధికార వైసీపీకి గుండెల్లో దడ పుట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.