బాబు అరెస్టు అక్రమం.. జగన్ సర్కార్ ది దుర్మారం!
posted on Oct 7, 2023 @ 10:23AM
స్కిల్ స్కామ్ అంటూ తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన అనంతరం రాష్ట్రంలో జగన్ రెడ్డి సర్కార్ తీరుపైనా, మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గత పదేళ్లుగా బెయిలుపై ఉన్న ఆయన అక్రమాస్తుల కేసులపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన జగన్ రెడ్డి సర్కార్ గురివింద సామెత తీరుగా వ్యవహరిస్తోందనీ, అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కాకుండా పదేళ్లుగా బెయిలుపై జగన్ బయట ఉన్నప్పుడు ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఖైదులో ఉంచడమేమిటని సామాన్యులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసులు, ఆ కేసుల దర్యాప్తు తీరు తెన్నులు, వ్యవస్థలను ఆయన మేనేజ్ చేస్తున్న తీరును,స్కల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన సమస్త వివరాలతో తెలుగుదేశం పార్టీ పుస్తకాల రూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చింది. రాజకీయ కుట్రలోభాగంగానే ముఖ్యమంత్రి జగన్, వైసీపీ సర్కార్ చంద్రబాబునాయుడిని ఆయనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో, ఎటువంటి ఆధారాలూ చూపకుండా అరెస్టు చేసిందన్న వాస్తవాలను గ్రహించి ప్రజలంతా జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీడియా సమావేశంలో వివరించారు.
రాష్ట్ర ప్రగతి, యువత భవిత కోసం ఆలోచించడం, ఆ దిశగా చర్యలు చేపట్టి అమలు చేయడమే చంద్రబాబు చేసిన నేరంగా జగన్ రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 16వేల లోటు బడ్జెట్ తో మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో పదవీ బాధ్యతలు చేపట్టారనీ, సంపన్న రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఒక సత్సంకల్పంతో ఏపీలో 6 మిషన్ల అమలుకు ప్రభుత్వపరంగా శ్రీకారం చంద్రబాబు శ్రీకారం చుట్టారనీ వివరించారు. ఆ 6 మిషన్లలో ఒకటిఒకటే నాలెడ్జ్ అండ్ స్కిల్ మిషన్. ఆ మిషన్లో భాగంగా కోట్లాదిమంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి, అభివృద్ధి వేగవంత మవుతుందని చంద్రబాబు భావించారు. ఇందుకోసమే.
2013లో గుజరాత్ లో సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలు అమలు చేసిన ప్రాజెక్ట్ పరిశీలించేందుకు ఏపీ నుంచి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపారు. ఆ బృందం సూచనలు.. సలహాలు పరిగణనలోకి తీసుకొని, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం యువత భవిత, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేష న్ ఏర్పాటు చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఏపీ యువత భవితకోసం.. రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు కృషి సత్ఫలితాలను ఇచ్చింది. లక్షల మంది నైపుణ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. వేలాది మంది మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన స్కిల్ సెంటర్లు ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. అయితే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలలో భాగంగానే జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇక స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నాటి చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ ఆమెదం ద్వారా రాష్ట్రంలో తొలుత 6 సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాలు, 36 శిక్షణ కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 42 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా 2.13లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్ మెంట్)లో శిక్షణ అందింది. ఆ శిక్షణ అందుకున్న వారిలో 72 వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. అంత గొప్పగా అమలైన ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందంటూ కేవలం ఆరోపణల ఆధారంగా చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్టు చేసిందని, ఇక అప్పటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయిందనీ పరిశీలకులు వివరిస్తున్నారు. జగన్ సర్కార్, ఏపీ సీఐడీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పై చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు అన్ని అసత్యాలు, కట్టుకథలు అని పేర్కొంటూ తెలుగుదేశం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సాధించిన అద్భుత ఫలితాలను, జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు, కేసులో డొల్లతనాన్ని వివరిస్తూ పుస్తకాన్ని వెలువరించింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి లేదని జగన్ రెడ్డి సర్కార్ చెప్పడం పూర్తి అవాస్తవమని, ఏ నిర్ణయాన్ని అయినా విధాన పరంగా అన్ని నిబంధనలు అనుసరించి చంద్రబాబు అమలు చేస్తారనీ, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కూడా ఎక్కడా ఎలాంటి తప్పూ జరగలేదని తెలుగుదేశం పార్టీ అన్ని వివరాలతో పుస్తకం వెలువరించింది.
స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమైన జీవోనెం-47ను నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నతవిద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న నీలంసహానీ జారీ చేశారని ససాక్ష్యంగా చూపింది. అలానే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన రూ.4 లక్షలను (సీడ్ కేపిటల్ మనీ) విడుదల చేశారని వివరించింది.
కార్పొరేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి సంతకాలు పెట్టిన వారిలో అజయ్ కల్లంతో పాటు, ఐ.వై.ఆర్ కృష్ణారావు కూడా ఉన్నారు. ఇలా ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన అధికారుల జోలికి వెళ్లకుండా వారిని విచారించకుండా విధానపరమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబునాయుడిని తప్పుపట్టడం ఎంతమాత్రం సరికాదని న్యాయనిపుణులు సైతం అంటున్నారు. బాధ్యులైన అధికారుల్ని వదిలేసి కేవలం చంద్రబా బునాయుడు లక్ష్యంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరించడం కక్ష సాధింపు వినా మరొకటి కాదని అంటున్నారు.
అన్నిటికీ మించి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ 20 నెలల సీఐడీ కేసు నమోదు చేసి, దాదాపు 30 మందిని అరెస్ట్ చేసింది. వారితో పాటు ఎందరినో విచారించింది. కొందరి బ్యాంక్ ఖాతాలు పరిశీలించారు. కానీ చివరకు ఒక్క రూపాయి ఫలానా వారి అకౌంట్ కు వెళ్లిందని నిరూపించలేకపోవడంతో సీఐడీ అభియోగాలు మోపిన వారందరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాలను వెంటనే విడుదలచేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అంతా అయిపోయాక ఇప్పుడు అదే వ్యవహారాన్ని బయటకుతీసి, చంద్ర బాబునాయుడిపై బురదజల్లే ప్రయత్నం మొదలెట్టింది జగన్ రెడ్డి సర్కార్.
వేలకోట్ల అవినీతి అని.. వందలకోట్లు చంద్రబాబుకు వెళ్లాయని.. వాళ్లకు డబ్బులు వెళ్లాయి..వీళ్లకు వెళ్లాయని ఆర్భాటంగా ప్రచారం చేసి.. రాజకీయపార్టీకి వచ్చిన విరాళాల సొమ్ముని అవినీతిసొమ్ముగా చూపేందుకు తెగించారు. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని న్యాయ స్థానాల ముందు పెట్టి అదే ఆధారం అంటూ ఏపీ సీఐడీ దిగజారిపోయింది.
అసలు స్కిల్ కేసులో జనగ్ సర్కార్, ఏపీ సీఐడీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని స్పష్టంగా తేలిపోయింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ సంస్థకు సంబంధంలేదని చేస్తున్న ఆరోపణ పూర్తిగా సత్యదూరమని గతంలో ఈడీకి సెక్షన్ – 50 కింద ఒక స్టేట్ మెంట్ ఇచ్చింది. దానిలో “మాకు డిజైన్ టెక్ సంస్థతో 2011 నుంచి భాగస్వామ్యం ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అమలు చేపట్టినా డిజైన్ టెక్ సంస్థ మాకు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ ద్వారానే మేం ఏపీలోప్రాజెక్ట్ అమలు చేశాం” అని విస్పష్టంగా పేర్కొంది.
ఇంత స్పష్టంగా సిమన్స్ స్టేట్ మెంట్ కనిపిస్తుంటే, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ తో సీమెన్స్ కు.. సీమెన్స్ సంస్థతో డిజైన్ టెక్ కు సంబంధంలేదని జగన్ రెడ్డి…, సీఐడీ చెప్పడం, దానిని నమ్మాలని కోర్టులలో వాదించడం విస్మయ పరుస్తోంది. అలానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో భాగం గా ఏపీ ప్రభుత్వం నుంచి తమ సంస్థకు రూ.90కోట్లు అందాయని కూడా సిమన్స్ సంస్థ ఎండీ తన వాంగ్మూలంలో ఈడీకి వివరించారు. అవేవీ జగన్ రెడ్డి సర్కార్ కు, ఏపీ సీఐడీకి ఎందుకు కనబడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.3వేలకోట్లు దారిమళ్లాయని చెబుతున్న బుగ్గన, సీమెన్స్ సంస్థ ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఏం సమాధానం చెబుతారని పరిశీలకులు నిలదీస్తున్నారు.అసలు మొత్తం స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ వ్యయమే రూ.3,300కోట్లు. దానిలో సీమెన్స్ సంస్థ గ్రాంట్ ఇన్ కైండ్ గా 90 శాతం వ్యయం భరిస్తుంది. 90 శాతం వ్యయం భరించడం అంటే నిధులు ఇవ్వడం కాదు.. ప్రాజెక్టుకు అవసరమైన సాఫ్ట్ వేర్..ఇతర పరికరాలు అందిస్తుంది. అదే పద్ధతిని కేంద్రప్రభుత్వ సంస్థలైన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. సెయిల్..ఓఎన్జీసీ, ఇంకా ప్రపంపచంలోని వివిధ సంస్థలు కూడా ఫాలో అయ్యాయి. అవుతున్నాయి.
ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో రూ.35కోట్లు సీమెన్స్ సంస్థకు వస్తే, రూ.1235కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ తాము ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు అందించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్ డెవల ప్ మెంట్ కార్పొరేషన్ అమలు పర్యవేక్షణ భాద్యత అంతా సీమెన్స్ సంస్థదే. మొత్తం ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగితే ఆ సంస్థను వదిలేసి, విధానపర నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబునాయుడిని తప్పు ఎంచడం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందనీ, రాజకీయ, కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును టార్గెట్ చేసి వేధిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం అకారణంగా పెంచారన్న ఆరోపణలో కూడా వాస్తవం లేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరికరాలు, సాఫ్ట్ వేర్ మదింపు బాధ్యతను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్రప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ కి అప్పగించింది. ఈ విషయం నాటి ప్రభుత్వంలో అధికారిగా పని చేసిన, ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రేమచంద్రారెడ్డి అనే అధికారి స్వయంగా చెప్పారు.
కేంద్రప్రభుత్వ సంస్థ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు.. సాఫ్ట్ వేర్ ను పరిశీలించి.. అంచనాలు మదించి..దానికి సంబంధించిన నివేదికను కూడా అందించింది. నిధుల విడుదలకు సంబంధించిన ఫైనాన్షియల్ అండర్ టేకింగ్ ఒప్పందంపై సంతకం చేసింది కూడా ప్రేమ్ చంద్రారెడ్డే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంలో డిజైన్ టెక్..సీమెన్స్ సంస్థలుకూడా సంతకాలు పెట్టాయని గంటా సుబ్బారావు అనే వ్యక్తి కేవలం సాక్షి సంతకమే పెట్టారని కూడా ప్రేమచంద్రా రెడ్డి ఈడీకి చెప్పారు. మొత్తం బాధ్యత తీసుకొని.. సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డిని ఏపీ సీఐడీ కనీసం విచారించకుండా.. సాక్షి సంతకం పెట్టిన గంటాసుబ్బారావుని నింది తుడిని చేయడం ఎక్కడి న్యాయమనీ, ఇదంతా జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగమేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రేమచంద్రా రెడ్డి పేరు కూడా ఎక్కడా సీఐడీ ఎఫ్.ఐ.ఆర్ లో లేదు. నిధుల విడుదలలో ప్రేమచంద్రా రెడ్డే ప్రధానంగా వ్యవహరించారు. ఆయనతో పాటు.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన నీలంసహానీ..అజయ్ కల్లంరెడ్డి… ఐ.వై.ఆర్ కృష్ణారావులు కూడా ఏసీ సీఐడీ విచారించిన దాఖలాలు లేవు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలన్నీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కల్లం పరిశీలించి, నిర్ణయం తీసుకున్నారని, అప్పుడు ఆయనతో పనిచేసిన పీ.వీ.రమేశ్ అనే అధికారి చెప్పారు. వీటన్నిటినీ బట్టి జగన్ రెడ్డి సర్కార్ కేవలం రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు అంటున్నారు.