మన పార్టీలకి సర్వం రాజకీయమేనా?

 

మన రాష్ట్ర రాజకీయనాయకులు వివిధ అంశాలపై ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తుంటే, వారికి రాష్ట్ర ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలే ఎక్కువని అర్ధం అవుతుంది. మొన్న హైదరాబాద్ బాంబు ప్రేల్లుళ్ళ సంఘటనను, నిన్న బాబ్లీ ప్రాజక్ట్ పై సుప్రీం కోర్టు వెలువరిచిన తీర్పు అంశాలను పట్టుకొని వారు ఆడుకొంటున్న తీరు చూస్తే ప్రజలకి వారి పట్ల క్రమంగా ఏహ్యత పెరుగుతోంది. వారిలో ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయినప్పటికీ, నిస్సిగుగ్గా తాము విఫలమయిన అంశాలనే పట్టుకొని మరీ రాజకీయాలు చేయడం నిజంగా సిగ్గు చేటు.

 

సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఆంధ్ర రాజకీయ నేతలందరూ సమిష్టిగా తమపై దండయాత్ర చేస్తారని భయపడిన మహారాష్ట్ర ప్రభుత్వం, మన రాజకీయ నేతల తీరు చూసి నవ్వు కొంటోందిప్పుడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టు తీర్పువల్ల మన రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిలేదని చెప్పడంతో, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది రెడ్డి తదితరులు “మరయితే ఇంతకాలం సుప్రీం కోర్టులో ఏమి గడ్డి పీకుదామని లాయర్లను పెట్టి కేసు నడిపించారంటూ” తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణాపై సర్వ హక్కులు తనవేనన్నట్లు మాట్లాడే కేసీఆర్, హరీష్ రావులు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా చేస్తున్న సమయంలోనే మొదలయిన బాబ్లీ పనులను ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు.

 

ఇక, నిజామాబాద్ యం.పీ. మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ దీనికి అంతటికీ మూల కారకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేకర్ రెడ్డే అని ఆరోపించారు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ పనులు మొదలుపెట్టినపుడు వాటిని అడ్డుకోమని ఆయనను తానూ ఎంతగా ప్రాదేయపడిన్నపటికీ ఆయన నిర్లక్ష్యం చేసారని, అందుకు తన వద్ద తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

 

అదే విధంగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు కూడా అంతే నిర్లక్ష్యం ప్రదర్శించి మహారాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా ప్రోత్సహించారని ఆరోపించారు. కనుక, ఇప్పుడయినా అన్నిరాజకీయ పార్టీలు , ఈ ఆరోప,ప్రత్యారోపణలు కట్టిబెట్టి రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన నీటికోసం ఏమి చేయాలో ఆలోచించాలని ఆయన కోరారు. అదే సమయంలో ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ, తెలంగాణా అంశంపై నుండి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు.

 

అయితే, ఈ కుమ్ములాటలలో క్షణం తీరిక లేకుండా ఉన్న మన రాజకీయ పార్టీల ధోరణి చూస్తే, ఇప్పటికయినా మేలుకొంటాయని భావించలేము. బహుశః బాబ్లీ అంశం వచ్చి బాంబు దాడుల అంశాన్ని వెనక్కి నెట్టినట్లే, మళ్ళీ త్వరలో మరో చర్చనీయాంశం తెర మీదకి వచ్చే వరకు వారి ఈ పోరాటం కొనసాగవచ్చును.