శాకాహారులకు దక్కని విటమిన్‌- B12

‘B విటమిన్’ మన శరీరానికి చాలా అవసరం అన్న విషయంలో ఎవరకీ ఏ సందేహమూ లేదు. ఇందులోనూ ఒకటి కాదు రెండు కాదు 8 రకాల విభాగాలు (B1, B2...) ఉన్నాయనీ, అవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం అనీ తెలుసు. కానీ వీటిలో విటమిన్‌ B12 గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు!

జీవక్రియలకు తప్పనిసరి

ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12ది చాలా ముఖ్య పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలోని జీవక్రియ సాగడంలో B12ది ఒక ప్రధాన పాత్ర. ఈ విటమిన్‌ కనుక లేకపోతే మన DNA వ్యవస్థ కూడా కుదేలవక తప్పదు. దురదృష్టవశాత్తూ మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారుచేసుకోలేదు. దాంతో బయట నుంచి వచ్చే ఆహారం మీదే శరీరం ఆధారపడవలసి ఉంటుంది. అక్కడే వస్తుంది అసలు చిక్క!

మాంసాహారంలోనే ఎక్కువ

వృక్షసంబంధమైన ఏ ఆహారంలోనూ ఈ B12 కనిపించదు. కేవలం మాంసాహారంలోనూ, పాలపదార్థాలలోనూ, గుడ్లలోనే ఈ విటమిన్‌ కనిపిస్తుంది. పెద్దవారిలో పాలు తాగే అలవాటు తక్కువ కాబట్టి, సహజంగానే ఈ విటమిన్‌ను తగినంతగా తీసుకునే శాకాహారుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. తగినన్ని పాలని తీసుకున్నా కూడా ఒకోసారి వాటిని జీర్ణం చేసుకోలేకపోవడం, వాటిలోని విటమిన్‌ను శరీరం శోషించుకోలేకపోవడం వల్ల కూడా అవసరమైనంత మేర B12 లభించకపోవచ్చు.

ఇతరత్రా కారణాలు

VEGAN అనే నియమాన్ని పాటించేవారు కొందరుంటారు. వీరు పాలు, పెరుగులతో సహా జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ ముట్టుకోరు. వీరిలో ఈ విటమిన్‌ లోపం మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఇక జీర్ణాశయం సరిగా పనిచేయకపోవడం, రక్తహీనత, మద్యపానం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం... ఇవన్నీ కూడా మన శరీరానికి తగినంత B12 లభించకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది.

నష్టాలు అపారం

శరీరానికి తగినంత B12 లభించకపోతే అపారమైన నష్టాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని నష్టాలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. B12 లోపం వల్ల ఏర్పడే ఇబ్బందులలో కొన్ని...

- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.
- అతిగా ఆలోచించడం, ప్రతి విషయానికీ క్రుంగిపోవడం.
- ఆకలి మందగించడం, అరుగుదలలో సమస్యలు.
- రక్తహినత, దాని వల్ల శరీరం పాలిపోయినట్లు కనిపించడం.
- నాడీవ్యవస్థలో ఇబ్బందుల. వాటి వల్ల శరీరం తిమ్మిర్లు ఎక్కినట్లు తోచడం, కండరాలు బలహీనపడిపోవడం.
  పరిష్కారం

మాంసాహారులకి B12 లోపాన్ని అధిగమించడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే మాంసం, చేపలు వంటి ఆహారంలో ఈ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎటొచ్చీ శాకాహారుల మాత్రం ఈ విషయంలో కాస్త తరచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. B12 లోపాన్ని అధిగమించేందుకు సూక్ష్మజీవుల ద్వారా మందులను (supplements) తయారుచేస్తూ ఉంటారు. వైద్యుల సలహా మేరకు ఈ మందులను తీసుకోవడం మంచిది. అయితే పాలు, పాల పదార్థాలను పుష్కలంగా తీసుకుంటే కనుక ఈ సమస్యను చాలావరకూ నివారించవచ్చు. ఏది ఏమైనా మన శరీరానికి తగినంతగా B12 అందుతోందా లేదా? అందకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న విషయమై ఒకసారి వైద్యుని సంప్రదించడం మేలు.

 

- నిర్జర.