అయ్యో అలీ... ఇంతా చేసి దక్కిన పదవి ఇదా?
posted on Oct 28, 2022 7:04AM
అంతన్నారు.. ఇంతన్నారు.. చివరికి అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టారు. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి ఏపీ సీఎం జగన్ మూడున్నరేళ్లు అదిగో పదవి.. ఇదిగో పదవి అని ఊరించి ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు.ఈ పదవిలో అలీ రెండేళ్లు కొనసాగుతారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ తెలుగు తెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలెట్టి హీరోగా, కమెడియన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో వైసీపీ గూటికి చేరాడు. ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీకి ఎన్నో సేవలు అందించాడు. దీంతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలీకి రాజ్యసభ టికెట్ హామీ ఇచ్చారు. మూడున్నరేళ్లు గడిచిపోయాయి. అలీకి పదవి దక్కలేదు.. సరికదా పార్టీలో ఆయన ఒకరు ఉన్నారన్న విషయమే ఎవరికీ తెలియదన్నట్లుగా అలీ పరిస్థితి తయారైంది.
ఇప్పుడు పుణ్యకాలం దాదాపుగా పూర్తయిన తరువాత ఇక తప్పదన్నట్లు తనకు ఓ సలహాదారు పదవిని అప్పగించి జగన్ చేతులు దులుపుకోవడం పట్ల అలీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయనకు సన్నిహితంగా మెలిగే వారు చెబుతున్నారు. రాజ్యసభ లేదా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి కావాలని కోరిన తనకు ఊరించి..ఊరించి చివరికి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి కట్టబెట్టడం పట్ల అలీ సంతోషంగా లేరనీ, తాను కోరింది, కోరుకున్నది ఇలాంటి పదవి కాదని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. అలీలో అసంతృప్తి గూడకట్టుకుందన్న విషయాన్ని గమనించి ఏదో బుజ్జగించడానికే ఈ పదవి కట్టబెట్టారని అలీ చెబుతున్నారని ఆయన సన్నిహితులే అంటున్నారు.
అయితే అయితే అలీ బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కలేదు. ఏది ఏమైనా అలీకి సలహాదారు పదవిపై మాత్రం సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. జగన్ నిజ్జంగానే అలీకి పదవి ఇచ్చారు అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అలీ ఇంటికి అల్లుడు వచ్చిన వేళా విశేషమో మరేమో కానీ,(ఈ మధ్యనే అలీ తమ కుమార్తె వివాహం చేశారు)ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయనకు పదవి కట్టబెట్టారని జోకులేస్తున్నారు.
నిజానికీ ,అలీ, పోసానీలతో పాటుగా మోహన్ బాబు ఫ్యామిలీ, పృధ్విరాజ్ గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి ఒక్క పృద్వీని మాత్రమే ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్ పదవికి నామినేట్ చేశారు. అది కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయింది. ఆయనపై ఏవో ఆరోపణలు రావడంతో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పెట్టేశారు. పృధ్విరాజు పార్టీకి దూరమయ్యారు.
అటు మోహన్ బాబు కూడా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలీ, పోసాని మాత్రం ఇంకా పార్టీని వదల కుండా చకోర పక్షుల్లా జగన్ రెడ్డి దయకోసం, కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. జబర్దస్త్ రోజా మంత్రి పదవికోసం ఎంతగా తాపత్రయ పడ్డారో, అంతకంటే ఎక్కువగా అలీ, పోసాని నామినేటెడ్ పదవుల కోసం తాపత్రయ పడుతున్నారని అంటారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఆలీని ఒకటికి రెండు సార్లు ఇంటికి పిలిచి మరీ ఒట్టి చేతులతో పంపించారు. రెండు మూడు సార్లు ఆయనకు పదవులు కేటాయించినట్టు ప్రచారం సాగింది. తొలుత రాజ్యసభ, ఆ తరువాత కేబినెట్ హోదాతో సమానమైన వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి అలీకి కేటాయించనున్నారన్న ప్రచారం జరిగింది. అలీ దంపతులు కలిసిన సందర్భంలో మీకు గుడ్ న్యూస్ చెబుతానంటూ స్వయంగా జగన్ చెప్పడంతో పాపం అలీ అమాయకంగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏదీ అలీ చెవిన పడలేదు. ఇప్పుడు ఇంత కాలానికి అలీకి ఓ పదవి కట్టబెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నా.. అదేమీ అలీకి గుడ్ న్యూస్ కాదని అంటున్నారు. ఎందుకంటే..
రాజ్యసభకు ద్వైవార్షిక ఎన్నికలు జరిగిన ప్రతిసారీ రాష్ట్రం నుంచి ఎంపిక చేసే అభ్యర్థుల జాబితాలో అలీ పేరు ప్రముఖంగా వినిపించేది. సినీ సమస్యలు చర్చించేందుకు చిరంజీవి, నాగార్జున, ప్రభాస్ తదితరులతోపాటు అలీని కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా పిలిపించారు. ఆ తర్వాత అలీ మీడియాతో మాట్లాడుతూ... ‘త్వరలోనే మంచి రోజు వస్తుంది’ అని సీఎం స్వయంగా చెప్పారంటూ ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దీంతో అలీకి రాజ్యసభ స్థానం పక్కా అని అలీతో సహా అంతా భావించారు. అది జరగలేదు. ఆ తర్వాత అలీని మైనారిటీ కమిషన్ చైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రభుత్వం నుంచే లీకులు వచ్చాయి. అదీ జరగలేదు. చివరకు ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా మరో సలహాదారుగా అలీ కంటితుడుపుగా ఒక పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే మీడియా సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్, జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ ఉండగానే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అనే కొత్త పోస్టును సృష్టించి దానిని అలీకి కట్టబెట్టారు జగన్.