అలా చేస్తే పిల్లల్లో ఆస్తమా రాదట
posted on May 4, 2019 @ 2:33PM
ఆస్తమా గురించి ఎంత చెప్పుకుంటే అంత భయం కలగక మానదు. వినడానికి చాలా చిన్న జబ్బులాగానే తోచినా, దీనిని అనుభవించేవారికి తెలుస్తుంది, అదెంత నరకమో! ఒకప్పుడంటే ఏదో జన్యవుల కారణంలో నూటికో కోటికో ఈ జబ్బు కనిపించేది. కానీ పెరిగిపోతున్న కాలుష్యం పుణ్యమా అని ఇప్పుడు లక్షలాది మంది ఉబ్బసం బారిన పడుతున్నారు.
నరకం - ప్రాణాంతకం
శ్వాసనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోయి ఊపిరి తీసుకోవడమే కష్టమయ్యే ఈ ఉబ్బసాన్ని తట్టుకోవడం పెద్దలకే సాధ్యం కాదు. అలాంటిది ఐదేళ్లలోపు పిల్లలకి కనుక ఈ వ్యాధి సోకితే ఇక చెప్పేదేముంది! పిల్లల్లో ఏర్పడే ఈ ఉబ్బసం ఒకోసారి వారి ప్రాణాలను కూడా హరించి వేస్తుంటుంది. కానీ ఓ జాగ్రత్తను కనుక తీసుకుంటే కనుక, పుట్టబోయే పిల్లలలో ఆస్తమా వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయని తేలింది.
ఒమేగా 3
ఆస్తమాకీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌కీ మధ్య ఏదో సంబంధం ఉందన్న అనుమానం ఈనాటిది కాదు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా డెన్మార్కుకి చెందిన 695 మంది గర్భవతులను గమనించారు. వీరు గర్భం దాల్చిన ఆరో నెల నుంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లోని EPA, DHA అనే ముఖ్య రసాయనాలను అందించారు. శరీరంలోని రోగనిరోధకశక్తిని అభివృద్ధి చేయడంలో ఈ రెండు రసాయనాలూ అద్భుతంగా పనిచేస్తాయని అంటారు. సాధారణంగా ఈ పోషకాలు చేపలలో ఎక్కువగా కనిపిస్తాయి.
సగానికి సగం
గర్భవతులుగా ఉన్నప్పుడు ఇలా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తీసుకున్నవారి పిల్లలను ఐదేళ్లు వచ్చేవరకూ కూడా నిశితంగా పరిశీలించారు. ఆశ్చర్యంగా ఈ పిల్లల్లో ఆస్తమా ప్రబలే ఆవకాశాలు దాదాపుగా యాభైశాతం తగ్గిపోయినట్లు తేలింది. దీంతో గర్భవతులుగా ఉన్నప్పుడు శరీరంలో EPA,DHAల స్థాయిని గమనించుకుని... తదనుగుణంగా అవసరమైన సప్లిమెంట్స్‌ని తీసుకుంటే కనుక ఆస్తమా లేని ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారని ఆశిస్తున్నారు.
ఈ సాంకేతికత మనవరకూ రావడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి అంతవరకూ EPA, DHAలను అందించే చేపలని కానీ అవసె గింజలని కానీ తీసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది.
- నిర్జర.