పాత పాటే పాడిన అరుణ్ జైట్లీ...
posted on Sep 8, 2016 @ 10:20AM
ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన వస్తుంది.. ప్రకటన వస్తుంది అని వచ్చిన వార్తల నేపథ్యంలో ఏపీ ప్రజలకు కేంద్రం మళ్లీ చెవులో పువ్వు పెట్టిన పనే చేసింది. ఏపీ ప్యాకేజీపై ప్రకటన చేయడానికి ఢిల్లీ నుండి వచ్చిన కేంద్రం ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పటిలాగే పాత పాట పాడి వెళ్లిపోయారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడిన ఆయన అసలు ఎంత ఇస్తాం అనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. అర్థ్రరాత్రి మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు కింద రూ.3975 కోట్లు ఇచ్చామని, మిగిలినది దశలవారీగా ఇస్తామని చెప్పారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం ఏపీకి అందించే సాయంపై పూర్తి వివరాలను గురువారం ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.
అంతేకాదు ఇప్పటికే ఏపీ కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చామని, వెనుకబడిన జిల్లాల నిధుల కింద 1500 కోట్లు ఇచ్చామని చెప్పారు. బెంగళూరు చైన్నై, విశాఖ-చెన్నై పారిశ్రామిక క్యారిడార్‌కు 12వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. రెవెన్యూ లోటుపై ఏపీ ప్రభుత్వం, నీతి ఆయోగ్ చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయని జైట్లీ తెలిపారు.