గుడివాడలో గందరగోళం.. కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం
posted on Mar 3, 2023 @ 11:40AM
మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ కొడాలి నానిని పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారు. క్యాసినో కేసులోనా? లేదా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులోనా? అంటే అవేమీ కాదు.. వైసీపీ విపక్షంలో ఉండగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా నమోదైన కేసులో కొడాలి నానిని అరెస్టు చేయక తప్పని అనివార్య పరిస్థితిని పోలీసులు ఎదుర్కొంటున్నారు.
2016లో ప్రత్యేక హోదా డిమాండ్ తో కొడాలి నాని ఆధ్వర్యంలో బెజవాడ తుమ్మలపల్లి కాళాక్షేత్రం నుంచి వన్ వే దారిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో అప్పడు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. పోలీసు ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించారంటూ అప్పట్లో కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. జారీ అయ్యి కూడా చాలా కాలం అయ్యింది. అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది కూడా. ఆ విషయంలోనే కోర్టు విజయవాడ గవర్నరు పేట సీఐను నానిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించింది.
దీంతో కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా ఇదే పెద్ద ఖంగారు పడాల్సిన విషయం కాదు.. ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిస్తే.. వెంటనే బెయిలు వచ్చేస్తుంది. అరెస్టు వారంట్ పెండింగ్ లో ఉన్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కోర్టు అరెస్టుకు ఆదేశించాల్సి వచ్చింది.
అలా కాకుండా వారెంట్ జారీ అయిన వెంటనే అరెస్టు చేసి ఉంటే స్టేషన్ బెయిలు పైనే ఆయన బయటకు వెళ్లిపోయి ఉండేవారు. అయితే మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం కొడాలి నాని అరెస్టు అనివార్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.