భయాలు అన్నీ కల్పితాలేనా?
posted on Jul 1, 2024 @ 9:30AM
మనిషిని భయం అనే మాట చాలా ప్రభావితం చేస్తుంది. బాగా గమనిస్తే, మన భయాలన్నిటికీ ఏదో ఒక రకంగా అజ్ఞానం కారణం అని అర్థమవుతుంది. మనకు తెలియని విషయం మనల్ని భయపెడుతుంది. తెలిసిన విషయం గురించి బాధనే లేదు. ఉదయం పూట హాయిగా స్వేచ్ఛగా తిరిగిన దారుల్లోనే, రాత్రి దీపం వెలుతురు లేకుండా తిరగాలంటే ఎంతవారికైనా గుండెలు అదురుతాయి. మన ఇళ్ళల్లోనే, చీకటి గది భయం కలిగిస్తుంది. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సిందేమిటంటే, అజ్ఞానం భయం కలిగిస్తుంది. జ్ఞానం భయాన్ని తొలగిస్తుంది.
చీకట్లో తాడును చూసి పాము అని భ్రమ పడతాం, భయపడతాం, చెమటలు కక్కేస్తాం. కానీ వెలుతురు వేసి చూస్తే అది పాము కాదు తాడు అని తెలుస్తుంది. అంత వరకూ మనం అనుభవించిన భయం మటుమాయం అవుతుంది. కాబట్టి మనకు కలిగే చిన్నచిన్న భయాల స్వరూపస్వభావాలను అర్థం చేసుకుంటే, వాటిని మించటం ఎంతో సులభం అవుతుంది. భయభావన పూర్తిగా అదృశ్యం కాకున్నా, భయభావనను మనకు లాభకరంగా వాడుకొనే వీలుంటుంది.
మానసికశాస్త్రవేత్తల ప్రకారం పుట్టిన పిల్లవాడికి భయాలుండవు. అతడిలో భయాలను మనమే కలిగిస్తాం. ఈ రకమైన ఆలోచనను ప్రతిపాదించటమే కాదు, వైజ్ఞానిక పరిశోధనల ద్వారా నిరూపించిన వ్యక్తి జాన్.బి. వాట్సన్. 1920లో ఈయన వైజ్ఞానికపరిశోధనలు చేసాడు. పదకొండు నెలల ఆల్బర్ట్ అనే బాలుడిపై భయంకరమైన పరిశోధనలు చేశాడు. ఆ వయసు పిల్లల్లాగే ప్రతి విషయం పట్ల భయరహితమైన కుతూహలం ప్రదర్శించేవాడు అల్బర్ట్, అటువంటి అల్బర్ట్ దగ్గరలో పెద్ద శబ్దం చేసి భయపెట్టటం ప్రారంభించాడు వాట్సన్. ఆ తరువాత అతని ఎదురుగా ఓ ఎలుకను వదిలిపెట్టేవాడు. అల్బర్ట్ ఎలుక వైపు చూసి భయపడటం ప్రారంభించాడు. ఈ ప్రయోగం ఇలాగే కొనసాగింది. ఇంకొన్నాళ్ళకి కేవలం ఎలుకను చూస్తూనే కాదు, బొచ్చు ఉన్న ప్రతి జంతువూ అతడిలో భయం కలిగించేది. కుక్క, పిల్లి, కుందేలు ఇలా ప్రతీదీ అల్బర్ట్ ను భయపెట్టేది.
ఈ ప్రయోగం ద్వారా పిల్లలకు భయాలు పెద్దలే కలుగజేస్తారని వాట్సన్ నిరూపించాడు. బాల్యంలో పిల్లలు నిద్ర పోకపోతే, బూచి వస్తుందని బెదిరిస్తాం. ఇది వారిలో తెలియని భయాన్ని కలిగిస్తుంది. దాంతో నిద్ర వారికొక భయకారణం అవుతుంది. అలాగే ఇచ్చింది తీసుకోకపోతే పక్క పిల్లవాడికి ఇచ్చేస్తాం, వాడొచ్చి ఎత్తుకుపోతాడు వంటి వాక్యాలతో భయపెడతాం. తాత్కాలికంగా పిల్లవాడు మనం చెప్పిన మాట విన్నా ఇటువంటి మాటలు అతడి మనసులో శాశ్వతంగా భయాలు కలిగిస్తాయి. ఎదిగిన కొద్దీ, అచేతనలోని ఈ భయాలు, తన దాన్ని ఎవరైనా ఎత్తుకు పోతారేమో, తనకు రావాల్సింది ఇతరులకి వెళ్ళిపోతుందేమోనన్న భావనలుగా రూపాంతరం చెందుతాయి. వ్యక్తిలో అభద్రతాభావాన్ని కలిగిస్తాయి.
సాధారణంగా మనం కొందరిలో కొన్ని విషయాలకు వాటి స్థాయిని మించిన తీవ్రమైన స్పందనను గమనిస్తాం. పిల్లలు మట్టి ముట్టితే చాలు, చితకబాదే తల్లిదండ్రులు మనకు తెలుసు. పరిశీలిస్తే ఈ ప్రవర్తనకు కారణం, ఇప్పటి పెద్దవాళ్ళు, పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళు మట్టి ముట్టినప్పుడల్లా వాళ్ళ పెద్దలు బెదిరించటం, కొట్టటం వంటివి చేసేవారని తెలుస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ కారణంగానే పిల్లలు మట్టిని తాకగానే హిస్టీరియా వచ్చినట్టు ప్రవర్తించటం చూస్తాం. ఇందుకు భిన్నంగా కొందరు పిల్లలు మట్టితో ఆడుతున్నా వారి తల్లితండ్రులు పెద్దగా పట్టించుకోరు. దీనికి కారణం బాల్యంలో వాళ్ళ తల్లిదండ్రులు, వారి పెద్దవాళ్ళ ప్రవర్తన కారణం. పిల్లలు మట్టిలో ఆడటం సహజం. అందువల్ల ఏమీ కాదు. స్నానం చేయిస్తే సరిపోతుంది. అన్న రీతిలో పెద్దలు ప్రవర్తిస్తే పిల్లల్లో కూడా మట్టిలో ఆడటం తప్పు అన్న భావన కలగదు. ఇలా భయం అనేది ఏదైనా ఎవరిలో అయినా ఉందంటే దానికి కారణం దాన్ని కల్పించుకోవడమే.
◆నిశ్శబ్ద.