అధికారులకు కోట్లు కురిపిస్తున్న ఆదిలాబాద్ చెక్ పోస్టులు
posted on Apr 17, 2012 @ 11:02AM
ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులోని వాణిజ్యపన్నుల చెక్ పోస్టుల్లో అధికార్లు, ఉద్యోగులకు కోట్లు కురిపిస్తున్నాయి. ఈ చెక్ పోస్టుల్లో ఉద్యోగం చేయటానికి వాణిజ్యపన్నుల శాఖలో పెద్దఎత్తున పోటీ ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఘోరాజ్, వాంకిడీ, భైంసా చెక్ పోస్టుల్లో ఉద్యోగం కోసం కోటి రూపాయలు సైతం లంచంగా ఇచ్చేందుకు అధికారులు వెనుకాడటం లేదు. ఈ చెక్ పోస్టుల్లో రోజువారీ అక్రమవసూళ్లు సుమారు 2లక్షల రూపాయల వరకూ ఉంటాయని ఒక అంచనా.
ఒక ఆరేళ్ళపాటు ఇక్కడ పనిచేస్తే వచ్చే ఆదాయంతో పోస్టు కొనుక్కోవటానికి తాము చేసిన ఖర్చు వెనక్కు తీసుకోవచ్చ న్నది అధికార్ల భావన. ఈ మూడు చెక్ పోస్టుల్లో ముగ్గురు డిపిటిఓ స్థాయి అధికార్లు, ఆరుగురు ఎసిటిఓ స్థాయి అధికార్లు ఉంటారు. ఈ మూడు చెక్ పోస్టుల నుంచి రోజుకు సగటున నాలుగువేల ఐదొందల లారీలు వెళుతుంటాయి. లారీ డ్రైవర్లు అమ్మకపు పన్ను, రవాణా అనుమతి పత్రాలు చెక్ పోస్టుల్లో చూపించాలి. అన్నీ సరిగ్గా ఉన్నా కనీసం లారీకి రూ. 200 రూపాయలు ముడుపు చెల్లించాల్సిందే. ఒకవేళ పత్రాలు సరిగ్గా లేకపోతే రెండు నుంచిఐదువేల రూపాయలు లంచంగా చెల్లించాల్సి ఉంటుంది. నిత్యం ఇలా పోగవుతున్న అక్రమార్జనను ఈ అధికారులు పెట్టుకున్న ప్రయివేటు సిబ్బంది హ్యాండిల్ చేస్తుంటారు. వీరు రెండు గంటలకు ఒకసారి అక్రమంగా వసూలు చేసిన డబ్బును సంచుల్లో పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. రాష్ట్రంలో మరే చెక్ పోస్టుల్లో ఇంత పెద్దస్థాయిలో అవినీతి జరగడం లేదనీ, ఈ చెక్ పోస్టుల ద్వారా వెళ్ళాలంటే భయంగా ఉందని లారీడ్రైవర్లు వాపోతున్నారు.