బండి సంజయ్ ది కార్పొరేటర్ స్థాయి! ఏపీలో ఆటలు సాగవన్న అంబటి
posted on Jan 6, 2021 @ 4:28PM
జగన్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బండి సంజయ్ కి కౌంటరిచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. బైబిల్ పార్టీకి ఓటేస్తారా? భగవద్గీత పార్టీకి ఓటేస్తారా? అంటున్నావు... నీకేం పోయే కాలం వచ్చింది? అంటూ బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది బైబిల్ పార్టీ మాత్రమే కాదని, భగవద్గీత పార్టీ, ఖురాన్ పార్టీ కూడా అని అంబటి ఉద్ఘాటించారు. ఈ మూడు కలిస్తేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.
బండి సంజయ్ కార్పొరేటర్ స్థాయి నాయకుడని విమర్శించారు అంబటి రాంబాబు. రాజకీయ అజ్ఞానంతో బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీ అంటూ పేర్లు పెట్టేశారని మండిపడ్డారు. అయినా నీకిదేం బుద్ధి? బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఎంతో పవిత్రమైనవి. ఓట్లు సంపాదిద్దామని వాటికి కూడా పార్టీలు పెట్టేశావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అన్ని మతాలతో సంబంధం ఉన్న పార్టీ అని అంబటి స్పష్టం చేశారు. ఈ బండి సంజయ్ ఎవరో కానీ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
కులాలు, మతాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకునే సంకుచిత పార్టీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తావులేదన్నారు అంబటి రాంబాబు. ఏదో ఒక రాష్ట్రంలో మతాన్ని అడ్డుపెట్టుకుని గెలిచి ఇక్కడ కూడా అదే చేద్దామనుకుంటే కుదరదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్న రాష్ట్రం. ఇక్కడ మీ ప్రయత్నాలు సాగవు. ధర్మం నాలుగు పాదాలపై నడుస్తున్న రాష్ట్రమిది. అన్ని మతాలు, కులాలను సమానంగా చూసే రాష్ట్రమిది అంటూ అంబటి రాంబాబు వివరించారు.