ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
posted on Jun 20, 2020 @ 5:10PM
కరోనా విజృంభణ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాలని విపక్ష నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో చర్చించి మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు.