అరుణ్ జైట్లీ సన్నాయి నొక్కులు.. మళ్లీ ఏపీకి కుచ్చుటోపి..
posted on Jul 29, 2016 @ 5:18PM
రాజ్యసభలో ఏపీ ప్రత్యేక ప్రైవేటు బిల్లుపై చర్చ ప్రారంభమైంది. ఈసారి కూడా కేంద్రం ఏపీ నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్టే కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ సన్నాయి నొక్కులు..నిబంధనల సాకుతో ఏపీ నోట్లో మళ్లీ కేంద్రం మట్టి కొట్టింది. కుంటిసాకులతో ప్రత్యేక హోదాకు మంగళం పాడింది. ప్రత్యేక హోదాపై జైట్లీ మాటలు వింటే ఇదే విషయం అర్ధమవుతుంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది చాలా సున్నితమైన అంశం.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదు.. అలాగని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం లేదు...అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు కాబట్టి ఆలోచిస్తున్నాం.. అని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పాలనాదక్షతతో.. ప్రజలు స్వయం కృషితో ఎప్పటికైనా..ఏపీ స్వాలంభన సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. బెంగాల్, కేరళలతో పాటు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారు.
మరోవైపు అరుణ్ జైట్లీ సమాధానంతో విపక్షాలు పెదవి విరిచాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరాయి. ఎంపీ సీఎం రమేశ్.. సీతారం ఏచూరి స్పందిస్తూ.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా..? లేదా..? అన్న విషయం తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. జైట్లీ ఆన్సర్ మరింత గందరగోళానికి దారి తీసేలా ఉందని సీతారాం ఏచూరి అన్నార. కేవీపీ రామచంద్రరావు స్పందించి ఈ సమాధానాన్ని అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు. ఇంకా జైట్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన దిగ్విజయ్ సింగ్, హోదా ఇవ్వకుంటే, ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, జైట్లీ సమాధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తానికి ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది.. లేనిది చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నెడుతూ కేంద్రం మరోసారి ఏపీ చెవిలో పెద్ద పువ్వే పెట్టింది.