ఆ ఇద్దరు అధికారులకు గండమే! పంజా విసరబోతున్న నిమ్మగడ్డ?
posted on Jan 28, 2021 @ 10:45AM
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మరోసారి పంజా విసరబోతున్నారా? ఏపీ సర్కార్ కు తన పవర్ ఏంటో చూపించబోతున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను పాటించని జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిమ్మగడ్డ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, సీనియర్ అధికారి గిరిజా శంకర్ ల పై ఎన్నికల కమిషనర్ సెన్సుర్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సెన్సుర్ ఆర్డర్ ని తిరస్కరిస్తూ సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇవ్వడమే తాజా వివాదానికి కారణమైంది.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం 2021 జనవరి నాటికి నమోదైన ఓటర్లతో జాబితా తయారు చేసి పంపాలని పంచాయతీ రాజ్‌శాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లను గతంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ కోరారు. అయితే ఎస్ఈసీ ఆదేశాలను వారు పట్టించుకోలేదు. ఓటర్ల జాబితాను సిద్ధం చేయలేదు. దీన్ని సీరియస్ గా తీసుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వీరిద్దరిపై అభిశంసన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఆదేశాలు పంపారు. అభిశంసనతో పాటు వారిపై బదిలీ వేటు వేయాలని కూడా ఎస్‌ఈసీ కోరింది.
అయితే ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేదీ, గిరిజా శంకర్‌లపై జారీ చేసిన అభిశంసన చర్యలను ప్రభుత్వం.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు తిప్పిపంపింది. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను తిరస్కరిస్తూ రెండు వేరువేరు ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ ఆదిత్యనాథ్ దాస్. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1969 కి విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కు కేవలం సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సీఎస్. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను అతిక్రమించేలా ఎన్నికల కమిషన్ నిర్ణయం ఉందని తిరస్కరిస్తున్నట్లు ఆ జీవోల్లో తెలిపారు.
అఖిల భారత సర్వీసు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకునే అధికారం ఎస్‌ఈసీకి లేదంటూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి వివరణ కోరకుండా, నోటీసులు జారీ చేయకుండా అభిశంసన చర్యలను జారీ చేయలేరని చెప్పినట్లు సమాచారం. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తన శాఖకు చెందిన ఇద్దరు అధికారులపై అభిశంసన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ పంపిన ఉత్తర్వులను వెనక్కి పంపుతున్నట్లు చెప్పారు. ఎస్‌ఈసీ రాసిన 9 పేజీల లేఖను తిప్పిపంపామని, ఐఏఎస్ అధికారులు ద్వివేదీ, గిరిజా శంకర్ యథాతథంగా తమ స్ధానాల్లో కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీ సీఎస్ తాజా ఉత్తర్వులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారు చేసి పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ద్వివేదీ, గిరిజా శంకర్‌పై ఏపీ సర్కారుతో పాటు కేంద్రానికి కూడా ప్రతిపాదనలు పంపారు నిమ్మగడ్డ. ఏపీ సర్కార్ తన ఆదేశాలను పాటించకపోవడంతో .. వారిపై అభిశంసనను సమర్ధించాలని కేంద్రాన్ని మరోసారి కోరనున్నారు నిమ్మగడ్డ. కేంద్రం అభిశంసనను సమర్ధిస్తే మాత్రం ఈ ఇద్దరు ఐఏఎస్‌లతో పాటు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులే. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల విషయంలో కేంద్రం నిర్ణయం తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డ మరింత దూకుడు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీ సర్కార్ కు నిమ్మగడ్డ చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.