E-వాచ్ యాప్ ఆవిష్కరించిన ఎస్ఈసీ! నిలిపివేయాలంటూ హైకోర్టుకు జగన్ సర్కార్
posted on Feb 3, 2021 @ 12:11PM
పంచాయతీ ఎన్నికల కోసం కొత్త యాప్ ను తీసుకొచ్చింది ఏపీ ఎన్నికల సంఘం . E - వాచ్ పేరుతో రూపొందించిన యాప్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబందించిన ఫిర్యాదులు, ఇతర వివరాలు, సమాచారం ఈ యాప్ లో అందుబాటులో ఉండనుంది. అక్రమంగా జరుగుతున్న కేసులను, దాడులను అడ్డుకోవడానికే, E-వాచ్ యాప్ ను రూపొందించినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చెయ్యాలనుకుంటే ఆ పిర్యాదుకి సంబంధించిన వివరాలతో పాటు, ఫోటోలను కూడా అప్ లోడ్ చేసే అవకాశముందని చెప్పారు. ఎన్నికలను పారదర్శంగా నిర్వహించేందుకు, మరియు బలవంతపు ఏకగ్రీవాలు, దాడులను అరికట్టడంతో పాటు, ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, ఓటర్లకు పటిష్ట భద్రతను E-వాచ్ యాప్ ద్వారా కల్పిస్తామని , E-వాచ్ యాప్ కు తోడు ఫిర్యాదుల స్వీకరణకు కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.
E-వాచ్ యాప్ ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎస్ఈసీ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేస్తామని, గురువారం నుంచి గూగుల్ ప్లే స్టోర్ E-వాచ్ యాప్ అందుబాటులో ఉంటుందని, E-వాచ్ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా ? లేదా..? అనేది కాల్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తామని, ఎన్నికల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు E-వాచ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిమ్మగడ్డ వివరించారు. ఇక ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు చురుగ్గా ఉన్నారన్నారు.
మరోవైపు E-వాచ్ యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, పంచాయతీ రాజ్ శాఖ యాప్ లు ఉండగా ప్రత్యేకంగా ఎన్నికల టైంలో యాప్ ను డిజైన్ చేయాల్సిన అవసమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వం అనుమతి లేకుండా బయటి టెక్నాలజీలు వాడేందుకు ఎస్ఈసీకి అధికారం లేదని వాదిస్తోంది. E-వాచ్ యాప్ ను టీడీపీ కార్యాలయంలో రూపొందించారన్న అనుమానం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడులకు సంబంధించిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అధికార పార్టీపై నెట్టే ప్రయత్నాలు జరగొచ్చని చెబుతున్నారు. E-వాచ్ యాప్ ను నిలిపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. యాప్ వినియోగంపై స్టే ఇవ్వాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ గురువారం విచారణకు రానుంది