సచివాలయానికి బ్రేక్
posted on Mar 11, 2014 @ 11:48AM
సచివాలయంలో మిగిలిన పనులన్నీ ఆగిపోయాయి. కేవలం రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన పనులు మాత్రమే శరవేగంగా, ఆగమేఘాలమీద జరిగిపోతున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి 60 రోజుల సమయాన్ని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి అన్ని శాఖలకు టైంటేబుల్ పంపారు. ఏ శాఖ ఏ తేదీలోగా ఏ పని పూర్తి చేయాలో వివరించారు. ఈ నెల 15వ తేదీలోగా ఫైళ్ల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రికార్డు రూమ్స్‌లో ఫైళ్లను కూడా ప్రాంతాల వారీగా విభజించాలని స్పష్టం చేశారు. తర్వాత ఆ ఫైళ్లను జిరాక్స్ తీయాలని, ఒక్కో ఫైలును మూడు సెట్లు చొప్పున జిరాక్స్ తీయాలని స్పష్టం చేశారు. దీంతో సాధారణంగా జరగాల్సిన పనులను అన్ని శాఖలు నిలుపుదల చేశాయి. కేవలం విభజన పనిని మాత్రమే చేస్తున్నారు.
రాష్ట్ర విభజనతో సంబంధం లేని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లోని ఉద్యోగులకు పదోన్నతులను కూడా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిన్హా నిలుపుదల చేశారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులతో పాటు వాస్తవంగా పదోన్నతి లభించాల్సిన సమయంలో పదోన్నతి రాకపోవడంతో సర్వీసుపై ప్రభావం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.