ఏపీ పోలీసులు జ్యుడీషియల్ అధికారులనూ వదలరా?
posted on May 8, 2023 @ 3:35PM
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఏ నిబంధనలూ వర్తించవా.. ప్రభుత్వానికీ, తమకూ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహించరు. అలా యిష్టారీతిగా వ్యవహరించడానికి ప్రభుత్వం వారికి లైసెన్స్ యిచ్చేసిందా? ఏమైనా తేడా జరిగితే కోర్టుల్లో చూసుకుందాం అన్న బరోసా యిచ్చేసిందా? అంటే రాష్ట్రంలో జరగుతున్న సంఘటనలూ, నెలకొన్న వాతావరణం చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. తాజాగా ఏకంగా ఒక సీఐ కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ గా నియమించిన లాయర్ ను చితక బాదారు. వివరాలిలా ఉన్నాయి.
ఒక వ్యక్తి అక్రమ నిర్బంధం విషయంలో ఏపీ హైకోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ అడ్వకేట్ ఉదయ సింహారెడ్డి, తన కోర్టు సిబ్బందితో వెళ్లారు. అక్రమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి పీఎస్ లో చిత్రహింసలకు గురయ్యాడని గుర్తించిన జ్యుడీషిల్ అధికారి ఉదయ సింహ అతడిని మరుసటి రోజు కోర్టులో హాజరు పర్చాల్సిందిగా అక్కడి పోలీసులకు చెప్పారు. అలాగే అందుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ దశలో పోలీసు స్టేషన్ లో ఉన్న సీఐ యిస్మాయిల్ పోలీసు సిబ్బంది లాయర్ ఉదయ సింహారెడ్డి, ఆయనతో వెళ్లిన యిద్దరు కోర్టు సిబ్బంది దాడి చేసి కొట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు సుమో పిల్ నమోదు చేసింది.
ఆ కేసు సోమవారం (మే 8) విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా హిందూపురం సీఐ యిస్తాయిల్ పై పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు నియమించిన కమిషన్ పై చేయి చేసుకోవడానికి సీఐకి ఎంత ధైర్యం అని వ్యాఖ్యానించింది. కోర్టు పాలనా విధులకు ఆటంకం కలిగించడమేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. తక్షణమే సిఐ యిస్మాయిల్ పై కోర్టు ధిక్కరణ కింద అభియోగాలు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది.
కాగా ఏపీలో ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడడాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. యిటీవలే కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ యిద్దరు ఆర్టీసీ అధికారులకు కోర్టు జైలు శిక్ష , జరిమానా కూడా విధించింది. యిప్పుడు సీఐ ఏకంగా కోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారిపైనే చేయి చేసుకోవడం సంచలనంగా మారింది.
యిప్పటికే న్యాయమూర్తుల్ని బూతుల్ని తిట్టిన కేసు సీబీఐ దర్యాప్తులో నత్తనడకన సాగుతోంది. మొత్తం మీద ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందన్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా జ్యుడీషియల్ అధికారిపై సీఐ చేయిచేసుకున్నసంఘటనలో హై కోర్టు సీరియస్ అయ్యింది.