Read more!

ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ ఇన్ చార్జ్  డీజీపీ రాజేంద్రనాథ్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త డీజీపీ నియామకం కోసం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను పంపారు.  ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సీఎస్ ఈసీకి పంపారు.

వీరిలో 1992 బ్యాచ్ కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఈసీ ఖరారు చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు.  మొత్తం మీద ఏపీ ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఎన్నికల వేళ, కోడ్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేయడాన్ని తెలుగుదేశం కూటమి స్వాగతిస్తున్నది.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నెలన్నర తరువాత ఈ బదిలీ జరగడం గమనార్హం, ముఖ్యంగా అనకాపల్లి లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పై దాడి అనంతరం ఎన్నికల సంఘం రాష్ట్రంలో  శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసి ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ సాయంత్రం  ఆయన బాధ్యతలు చేపట్టారు.