జమ్మలమడుగులో ఉద్రిక్తత
posted on Jul 3, 2014 @ 2:11PM
మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికలలో తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పోటాపోటీగా ఉన్న మున్సిపాల్టీలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.జమ్మలమడుగు మున్సిపాలిటీలో కౌన్సిలర్ జానీని వైకాపా శ్రేణులు కిడ్నాప్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే అనుచరులే జానీని కిడ్నాప్ చేసినట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ముళ్లజానీ కిడ్నాప్‌పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమంది కార్యకర్తలు జమ్మలమడుగు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వైకాపా కౌన్సిలర్లతో కలిసి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు.