వలస కార్మికులను రాష్ట్రానికి తెచ్చేందుకు చర్యలు!
posted on Apr 29, 2020 @ 8:34PM
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కరోనా పై ఏర్పాటు చేయబడిన మంత్రులు బృందం స్పష్టం చేసింది.
ఈ మేరకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) అధ్యక్షతన మంత్రుల బృందం(GOM) సమావేశం జరిగింది.ఈ సమావేశంలో కరోనా నేపధ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరును మంత్రుల బృందం సమీక్షించింది.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తదితర మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడా ఓపి సేవలు అందించడం లేదని సమావేశం దృష్టికి తేగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందించాలని దీనీపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని మంత్రుల బృందం అధికారులకు స్పష్టం చేసింది.
అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకూలీలు, విద్యార్థులు తదితరులను రాష్ట్రానికి తీసుకువచ్చేందు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కూలీలు వారు రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారా లేక వారి రాష్ట్రాలకు వెళ్ళాలని అకుంటున్నారో తెల్సుకుని ఆ ప్రకారం చర్యలు తీసుకోవాలని జిఓయం అధికారులను ఆదేశించింది.
ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చే వలస కూలీలు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న గ్రీన్ జోన్లు రెడ్ జోన్లుగా మారకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇంకా ఈ మంత్రుల బృందం సమావేశంలో కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించి అధికారులకు తగిన మార్గనిర్దేశం చేసింది.